సిటీబ్యూరో, జూలై 3 (నమస్తే తెలంగాణ) : జీహెచ్ఎంసీ సాధారణ సమావేశానికి పూర్తి సమాచారంతో సిద్ధం కావాలని బల్దియా కమిషనర్ ఆమ్రపాలి అధికారులకు సూచించారు. ఈ నెల 6న నిర్వహించనున్న 9వ సాధారణ సమావేశానికి ఆయా విభాగాల అధికారులతో బుధవారం కమిషనర్ తన చాంబర్లో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. స్టాండింగ్ కమిటీ, కౌన్సిల్ సమావేశం ఎజెండా అంశాలపై కమిషనర్ చర్చించారు. కౌన్సిల్ సమావేశంలో కొశ్చన్, ఆన్సర్లకు సంబంధించి ఆయా విభాగాల అధికారులు సమగ్ర వివరణ ఇచ్చేలా సిద్ధం కావాలని సూచించారు. పూర్తి సమాచారాన్ని అందించాలని కోరారు. కౌన్సిల్ సమావేశం సాఫీగా జరిగేలా అన్ని ఏర్పాట్లు చేయాలన్నారు. ఆయా విభాగాలకు సంబంధించిన పలు అంశాలపై ఆమె చర్చించి.. పలు సూచనలు చేశారు. ఈ సమావేశంలో ఈఎన్సీ జియావుద్దీన్, ప్రాజెక్టు సీఈ దేవానంద్, సీఈ కోటేశ్వరరావు, అదనపు కమిషనర్లు శ్రీవాత్సవ, స్నేహ శబరీశ్, శివకుమార్ నాయుడు, నళినీ పద్మావతి, గీతా రాధిక, యాదగిరిరావు, సునందరాణి, సీసీపీ రాజేంద్ర ప్రసాద్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.