హైదరాబాద్, డిసెంబర్ 14 (నమస్తే తెలంగాణ) : దేశ రక్షణ విభాగాన్ని ఎంచుకునే యువతకు అంతిమ లక్ష్యం దేశ భద్రతే కావాలని ఎయిర్ చీఫ్ మార్షల్, చీఫ్ ఆఫ్ ది ఎయిర్‌స్టాఫ్ ఏపీ సింగ్ చెప్పారు. దుండిగల్‌లోని ఎయిర్‌ఫోర్స్ అకాడమీలో కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ పరేడ్ (సీజీపీ) శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆయన.. యుద్ధ రంగంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న ఏరోస్పేస్ శక్తిని వివరించారు. పోరాట పటిమను కొనసాగించడం ద్వారానే కెరీర్లో ఉన్నత స్థాయికి చేరుకుంటామని చెప్పారు. తోటి ఆఫీసర్స్‌తో సమన్వయం, జట్టుగా కృషి చేయడం, అంకితభావం, చిత్తశుద్ధితో పనిచేయడాన్ని అలవర్చుకోవాలని వాయు, నౌకాదళాల ఆఫీసర్స్‌కు పిలుపునిచ్చారు. అంతకుముందు క్యాడెట్ల నుంచి గౌరవ వందనం స్వీకరించారు.
అనంతరం గ్రాడ్యుయేట్ ఫ్లయింగ్ క్యాడెట్లకు రాష్ట్రపతి కమిషన్‌ను ప్రదానం చేశారు. శనివారం మొత్తం 204 మంది క్యాడెట్లు గ్రాడ్యుయేషన్‌ను పూర్తి చేశారు. వీరిలో 178 మంది పురుషులు, 26 మంది మహిళలు ఉన్నారు. భారత నౌకాదళానికి చెందిన 9 మంది అధికారులు, భారత తీర రక్షక దళానికి చెందిన 9 మంది అధికారులు, ఒక విదేశీ అధికారికి ‘వింగ్స్’ను ప్రదానం చేశారు. పైలట్ల కోర్సులో మెరిట్ సాధించి మొదటి స్థానంలో నిలిచిన ఫ్లయింగ్ ఆఫీసర్ పరాగ్ ధంకర్‌కు ప్రతిష్టాత్మక ‘ప్రెసిడెంట్స్ ప్లేక్ .. చీఫ్ ఆఫ్ ది ఎయిర్ స్టాఫ్ స్వోర్డ్ ఆఫ్ హానర్’ లభించింది.
గ్రౌండ్ డ్యూటీ బ్రాంచ్‌లో మెరిట్ సాధించిన ఫ్లయింగ్ ఆఫీసర్ రామ్ ప్రసాద్ గుర్జార్‌కు ప్రెసిడెంట్స్ ప్లేక్ లభించింది. పరేడ్ అనంతరం పీసీ-7 ఎంకే-II, ఎస్‌యూ-30 ఎంకేఐ వంటి యుద్ధ విమానాలు, సారంగ్ హెలికాప్టర్లు, సూర్య కిరణ్ ఏరోబాటిక్ టీమ్‌ల విన్యాసాలు ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో ఎయిర్ మార్షల్ ఎస్ శ్రీనివాసులు, ఎయిర్ మార్షల్ నగేశ్ కపూర్, పలువురు సీనియర్ ఫ్లయింగ్ ఆఫీసర్లు, క్యాడెట్ల కుటుంబసభ్యులు పాల్గొన్నారు.