హయత్‌నగర్, ఏప్రిల్ 22 : పోలీసుల వేధింపులు తాళలేక ఓ కాలనీ అధ్యక్షుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. హయత్‌నగర్ పోలీసులు, మృతుడి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. సూర్యాపేట జిల్లా నూతనకల్‌కు చెందిన దూడిగం మధుసూదన్(43) కుటుంబంతో కలిసి హయత్‌నగర్ డివిజన్ లక్ష్మీప్రియ కాలనీలో స్థిరపడ్డాడు. వృత్తిరీత్యా కారు డ్రైవరైన మధుసూదన్.. కాలనీ అధ్యక్షుడి కొనసాగుతున్నాడు. కాలనీ మాజీ అధ్యక్షుడు బూడిద యాదగిరిగౌడ్‌తో స్థానిక సమస్యల విషయంలో గొడవలు జరుగుతున్నాయి.
కాలనీ అసోసియేషన్ డబ్బులు వినియోగించుకున్నందుకు యాదగిరిగౌడ్, ప్రస్తుత ప్రెసిడెంట్ మధుసూదన్‌కు చెక్ రూపంలో రూ. 9 లక్షలు చెల్లించాడు. ఈ విషయమై తాను లక్షకు మాత్రమే చెక్‌ను ఇస్తే.. తన అకౌంట్ నుంచి రూ.9 లక్షలు డ్రా చేశారని యాదగిరిగౌడ్ హయత్‌నగర్ పీఎస్‌లో మధుసూదన్, కాలనీకి చెందిన మరో వ్యక్తి నిరంజన్ యాదవ్‌లపై కేసు పెట్టాడు. పోలీసులు మధుసూదన్, నిరంజన్ యాదవ్‌లను వారి కుటుంబ సభ్యులను పలుదఫాలుగా పోలీస్ స్టేషన్‌కు తీసుకొచ్చి విచారణ పేరుతో వేధింపులకు గురిచేశారు.
ఇటీవల ఆత్మకూరుకు వెళ్లిన మధుసూదన్‌ను ఫోన్ లొకేషన్ ఆధారంగా అరెస్టు చేసి పీఎస్‌కు తీసుకొచ్చారు. అతడి భార్య, పిల్లలను కూడా తీసుకొచ్చి విచారణ చేశారు. ఈ క్రమంలో తీవ్ర మనస్తాపానికి గురైన మధుసూదన్ బుధవారం ఇంట్లో ఆత్మహత్య చేసుకున్నాడు. ‘నా ఆత్మహత్యకు కారణం బోడ యాదగిరి గౌడ్, వాళ్ల తమ్ముడు రమణ అండ్ బ్యాచ్, పోలీసు సపోర్టు’..అని రాసి ఉరేసుకున్నాడు. మృతుడి కాగా, మృతుడి కుటుంబసభ్యులు యాదగిరిగౌడ్ ఇంటి ఎదుట మధుసూదన్ మృతదేహాన్ని పెట్టి..కాలనీవాసులు, వివిధ పార్టీల నేతలతో కలిసి ధర్నాకు దిగారు. ఎల్బీనగర్ అడిషనల్ డీసీపీ కోటేశ్వరరావు, వనస్థలిపురం ఏసీపీ కౌశిరెడ్డి పరిస్థితిని చక్కదిద్దేందుకు చర్యలు తీసుకున్నారు. కాగా, మృతుడి కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.