ఎల్బీనగర్, ఆగస్టు 4 : సరూర్‌నగర్ సర్కిల్ కార్యాలయం రెవెన్యూ అధికారులు అవినీతికి పాల్పడుతూ భవనాల అసెస్మెంట్లో అవకతవకలు చేస్తున్నారని, తాను విధులు నిర్వహించకుండా అడ్డుకుంటున్నారని జీహెచ్ఎంసీ కమిషనర్‌కు ఫిర్యాదు చేసిన బిల్ కలెక్టర్ శ్రీశైలం యాదవ్ సోమవారం ఎల్బీనగర్ జోనల్ కమిషనర్ హేమంత్ కేశవ్ పాటిల్‌ను ప్రజావాణిలో కలిసి ఫిర్యాదు చేశారు. జీహెచ్ఎంసీ కి రావాల్సిన ఆదాయానికి గండి కొడుతున్న తీరును, ప్రస్తుతం కమర్షియల్‌గా సాగుతున్న హోటళ్లు, హాస్టళ్లు, ఫంక్షన్ హాళ్లకు రెసిడెన్షియల్‌గా ట్యాక్స్‌లు వేస్తున్న తీరును ఉదాహరణలతో వివరించారు.
తాను జీహెచ్ఎంసీ ఆదాయాన్ని పెంచేందుకు ప్రయత్నిస్తుంటే తనపై అధికారులు కించ పరుస్తూ డాకెట్లు మారుస్తూ వేధించారని, అందుకే స్వచ్ఛంద పదవీ విరమణ కోరారని తెలిపారు. తాను తెలిపిన భవనాల వివరాలు తెలుసుకుంటే అసలు వాస్తవం తెలుస్తుందని ఆయన జోనల్ కమిషనర్‌కు వివరించారు. జోనల్ కమిషనర్ తనకు మద్దతుగా నిలిచారని, విధులను చేసుకోవాలని, ఎలాంటి ఇబ్బందులు ఉండవని హామీ ఇచ్చినట్లు శ్రీశైలం యాదవ్ తెలిపారు.
శ్రీశైలం యాదవ్ ఇచ్చిన సమాచారంతో జోనల్ కమిషనర్ హేమంత్ కేశవ్ పాటిల్ సరూర్ నగర్సర్కిల్ ఉప కమిషనర్‌తో పాటుగా సంబంధిత అధికారులను వివరణ అడగటంతో పాటుగా కమర్షియల్ భవనాలకు రెసిడెన్షియల్ ట్యాక్స్‌లు వేయడం ఏమిటంటూ ప్రశ్నించినట్లు సమాచారం. శ్రీశైలం యాదవ్ ఇచ్చిన భవనాల వివరాల గురించి జోనల్ కమిషనర్ ప్రశ్నించిన నేపథ్యంలో సరూర్‌నగర్ సర్కిల్ అధికారులు ఆయా భవనాల్లో తమ తప్పులు ఏమి లేవని తెలిపేందుకు ఆగమేఘాలపై సదరు భవనాల అసెస్మెంట్ను గుట్టుగా తాజాగా చేపడుతున్నట్లు తెలిసింది.
కొన్ని రోజులుగా భవనాలకు కమర్షియల్‌గా ట్యాక్స్ వేయాలంటూ బిల్ కలెక్టర్ చేసిన ప్రయత్నాలను అడ్డుకున్న టీఐ, ఏఎంసీ, ఉప కమిషనర్ తాజాగా ఆయా భవనాల అసెస్టెంట్కు ఉరుకులు పరుగులపై చేపడుతున్నట్లు తెలుస్తోంది. సోమవారం సరూర్‌నగర్ హుడా కాంప్లెక్స్ ప్రాంతంలోని ఓ హోటల్‌కు చెందిన ట్యాక్స్ విషయంలో అధికారులు ట్యాక్స్‌ను పెంచేందుకు అసెస్మెంట్ చేస్తున్నారు. ఇలా సరూర్‌నగర్ సర్కిల్లో ఒక్క ప్రాంతంలోనే కాదు మొత్తంగా జోనల్ వ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో రెవెన్యూ విభాగం వారు ట్యాక్స్‌ల విషయంలో అమ్యామ్యాలకు అలవాటు పడి తూతూ మంత్రంగా అసెస్మెంట్లు చేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి.