Collector Gautham | మేడ్చల్ కలెక్టరేట్, ఆగస్టు 28 : రోడ్ల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని, ప్రమాదాల నివారణకు ప్రణాళికలు రూపొందించాలని మేడ్చల్ జిల్లా కలెక్టర్ గౌతమ్ అధికారులను ఆదేశించారు. జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో బుధవారం ట్రాఫిక్, మున్సిపాలిటీ, ఆర్అండ్బీ, ఎన్హెచ్ అధికారులతో కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. రోడ్లపై వర్షపునీరు నిలువకుండా చర్యలు, ప్రమాదాలు జరిగే ప్రదేశాలను గుర్తించి నివారణకు ప్రణాళికలు రూపొందించాలని, రహదారుల వెంట వీధి దీపాలు ఏర్పాటు చేయాలని సూచించారు.రోడ్లపై అవసరమైన ప్రాంతాల్లో కల్వర్టులు నిర్మించాలని, రోడ్డు పక్కన ఉన్న నాలాలను క్లియర్ చేయాలని, రహదారి భద్రత అనే అంశాలపై పాఠశాలల్లో విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించాలన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ రాధికగుప్తా, అధికారులు పాల్గొన్నారు.