మేడ్చల్, మార్చి1(నమస్తే తెలంగాణ): పెండింగ్‌లో ఉన్న ఎల్ఆర్ఎస్ దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ గౌతమ్ మున్సిపల్ కమిషనర్లను ఆదేశించారు. జిల్లా కలెక్టరేట్లో శనివారం జిల్లా అదనపు కలెక్టర్ విజయేందర్‌రెడ్డితో కలిసి మున్సిపల్ కమిషనర్లతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎల్ఆర్ఎస్ దరఖాస్తులు చేసుకున్న వారందరికీ సంబంధిత అధికారులు ఫోన్ చేసి ఈ నెల 31లోగా క్రమబద్ధీకరణ రుసుం చెల్లించినట్లయితే 25 శాతం వస్తుందని తెలపాలని సూచించారు.
ఎల్ఆర్ఎస్లో వచ్చిన దరఖాస్తులలో నిబంధనల మేరకు అన్ని ధృవపత్రాలు ఉన్నట్లయితే దరఖాస్తుదారులకు ఫోన్ చేయాలన్నారు. జిల్లాలోని మున్సిపాలిటీల వారీగా ఎన్ని దరఖాస్తులు వచ్చాయి, ఇందులో ఎన్ని పరిశీలించి పెండింగ్‌లో ఉన్న వివరాలను మున్సిపల్ కమిషనర్లను అడిగి తెలుసుకున్నారు. ప్రత్యేక డ్రైవ్ ఏర్పాటు చేసి త్వరగా దరఖాస్తుల పరిశీలన పూర్తి చేయాలని కలెక్టర్ గౌతమ్ అన్నారు. ఈ క్రమంలో ప్రతిరోజు దరఖాస్తులపై పురోగతిని మెసేజ్ ద్వారా పంపించాలని సూచించారు. దరఖాస్తుదారుల క్రమబద్ధీకరణ రుసుం చెల్లించేందుకు ఆన్లైన్ ద్వారా లేదా వార్డు కార్యాలయంలో ఏర్పాటు చేసిన హెల్ప్‌డెస్క్‌ల వద్ద చెల్లించే విధంగా చూడాలని అధికారులకు
సూచించారు.
జిల్లాలో వేసవిలో నీటి ఎద్దడి ఏర్పడకుండా చర్యలు తీసుకోవాలని మున్సిపల్ కమిషనర్లలకు కలెక్టర్ గౌతమ్ సూచించారు. బోర్లకు మరమ్మత్తులు చేయించాలని, అవసరమైన చోట వాటర్ ట్యాంకర్లను ఏర్పాటు చేసి ప్రజలకు నీటి సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సమావేశంలో డీఆర్వో హరిప్రియ తదితరులు పాల్గొన్నారు.