Anudeep Durishetti | సిటీబ్యూరో, ఆగస్టు 24 (నమస్తే తెలంగాణ) : విద్యార్థులు చదువులో వెనకబడితే వారిపై ప్రత్యేక దృష్టి సారించి రాణించేలా ప్రోత్సాహం అందించాలని హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి విద్యాశాఖాధికారులను ఆదేశించారు.
తిరుమలగిరి మండలంలోని బోయిన్పల్లి బాపూజీనగర్ ప్రభుత్వ గిరిజన వాటర్ స్పోర్ట్స్ అకాడమీ వసతి గృహాన్ని శనివారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. వసతిగృహంలో వంటగది, స్టోర్ రూం, హాజరు రిజిస్టర్, స్టాక్ రిజిస్టర్, స్టాక్ నిల్వలను పరిశీలించారు. అనంతరం ఐదో తరగతి విద్యార్థులతో ఇంగ్లిష్ పాఠ్యపుస్తకాలను చదివించారు.
విద్య అనేది చాలా శక్తివంతమైనదని విద్యార్థులకు కలెక్టర్ చెప్పారు. బాగా చదివి మంచి భవిష్యత్తును నిర్మించుకోవాలని సూచించారు. చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి ఆర్. కోటాజి, సికింద్రాబాద్ ఆర్డీఓ దశరథ్ సింగ్, వసతి గృహ సంక్షేమ అధికారి ఎం. నీలిమా, తహసీల్దార్ ఎస్. అశోక్ కుమార్, ప్రధానోపాధ్యాయురాలు అనిత తదితరులు పాల్గొన్నారు.