సిటీబ్యూరో, సెప్టెంబర్ 13 ( నమస్తే తెలంగాణ ) : హైదరాబాద్ జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల హాజరుశాతం పెరిగిందని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు. హుమాయున్ నగర్ ప్రభుత్వ పాఠశాలను కలెక్టర్ శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. అమ్మ ఆదర్శ పాఠశాల కార్యక్రమంలో భాగంగా పాఠశాలల్లో చేపట్టిన పనులను పరిశీలించారు. పాఠశాల ఆవరణలో ఎర్రమట్టితో గ్రీనరీ పెంచాలని ఆదేశించారు.
విద్యార్థుల హాజరుశాతంలో హైదరాబాద్ జిల్లా 67.65 శాతంతో ద్వితీయ స్థానంలో నిలిచిందని చెప్పారు. పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించడం, ఎప్పటికప్పుడు అధికారుల పర్యవేక్షణ, ప్రధానోపాధ్యాయుల కృషితో విద్యార్థుల హాజరు శాతం పెరిగిందని కొనియాడారు. ప్రధానోపాధ్యాయులు మరింత కృషి చేసి హైదరాబాద్‌ను మొదటిస్థానంలో నిలపాలని కోరారు. కలెక్టర్ వెంట డీఈఓ రోహిణి, ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ చలపతి రావు తదితరులు ఉన్నారు.