సిటీబ్యూరో, నవంబర్ 13(నమస్తే తెలంగాణ): అధికార పార్టీ కాంగ్రెస్‌లోనే కాదు.. దాని అనుబంధ సంఘాల్లోనూ అంతర్గత కుమ్ములాటలు పెరిగిపోతున్నాయి. గాంధీభవన్ వేదికగా ఇటీవల జరిగిన గ్రేటర్ ప్రజాప్రతినిధుల సమావేశంలో వర్గాల వారీగా విడిపోయి సమావేశాన్ని రసాభాసాగా మార్చిన సంగతి తెలిసిందే. ఈ బాటలోనే కాంగ్రెస్ అనుబంధ సంఘమైన ఐఎన్టీయూసీలోనూ పోటాపోటీ యూనియన్లు ఏర్పాటు చేసుకుంటూ బలప్రదర్శనలకు దిగుతున్నారు. అగ్రకుల, బీసీ సామాజిక వర్గాల మధ్య వైరంగా యూనియన్లు ఏర్పడుతున్నాయి. ఇందుకు జలమండలిలో కాంగ్రెస్‌కు అనుంబంధమైన ఐఏన్టీయూసీ పేరిట రెండు యూనియన్లు ఉండటమే నిదర్శనం. వచ్చే నెలలో జరిగే జలమండలి గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల వేళ కాంగ్రెస్ అనుబంధ యూనియన్ నేతల మధ్య పోరు ఉద్యోగుల్లో చర్చనీయాంశంగా మారింది.
జలమండలి గుర్తింపు యూనియన్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ కాంగ్రెస్‌లో కుమ్ములాటలు విస్తృత చర్చకు దారితీశాయి. తెలంగాణ జలమండలి ఎంప్లాయీస్ యూనియన్(నం.2898)కు గౌరవ అధ్యక్షుడిగా మాజీ ఎంపీ, ఏఐసీసీ అధికార ప్రతినిధి మధుయాష్కీ గౌడ్ ఉండగా, అధ్యక్షుడిగా సీనియర్ కార్మిక నేతగా గుర్తింపు ఉన్న చెవ్వా సతీశ్‌కుమార్ కొనసాగుతున్నాడు. గత ఎన్నికల్లో స్వల్ప తేడాలో సతీశ్‌కుమార్ యూనియన్ ఓడిపోగా.. అప్పటి నుంచి కాంగ్రెస్ అనుబంధ ఐఎన్టీయూసీ సంఘంగా కార్మికుల పక్షాన మధుయాష్కి, సతీశ్‌కుమార్ నిలబడుతూ వస్తున్నారు. ఐతే ఇటీవల కాలంలో సతీశ్‌కుమార్‌తో కలిసి పనిచేసిన కొందరు కార్మిక నేతలు ఆ యూనియన్ వీడి జలమండలి కామ్‌గార్ యూనియన్ పేరిట కాంగ్రెస్ పార్టీ అనుబంధ యూనియన్ ఇదేనంటూ తెరమీదకు తీసుకువచ్చారు.
కామ్గార్ను గౌరవ అధ్యక్షుడిగా సంజీవరెడ్డి, అధ్యక్షుడిగా ఐఎన్టీయూసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మొగుళ్ల రాజిరెడ్డితో కలిసి మరో యూనియన్‌గా ఏర్పాటు చేసుకున్నారు. సీనియర్ నేతగా ఉన్న మధుయాష్కిని కాదని సీఎం రేవంత్‌రెడ్డి బంధువు అని చెప్పుకుంటున్న మొగుళ్ల రాజిరెడ్డిని ఆ పార్టీలోని కొందరు ముఖ్యులు ప్రోత్సహించడం, స్థానికేతరుడైన రాజిరెడ్డి ఎలా జలమండలి కార్మిక యూనియన్‌కు వస్తాడన్న సతీశ్‌కుమార్ యూనియన్ నేతలు భగ్గుమంటున్నారు. జలమండలిలో బలమైన యూనియన్‌గా తెలంగాణ జలమండలి ఎంప్లాయీస్ యూనియన్ ఉందని, ఐఎన్టీయూసీ అనుబంధంగా ఒక సంఘం ఉన్న తర్వాత మరో సంఘాన్ని కార్మికులెవ్వరూ గుర్తించడంలేదని మధుయాష్కి గౌడ్ అంటున్నారు. మొగుళ్ల రాజిరెడ్డి అంశాన్ని పార్టీ అధిష్టానంతో చర్చిస్తామని మధుయాష్కిగౌడ్ తేల్చి చెబుతున్నాడు. మొత్తంగా ఎన్నికల సమీపిస్తున్న వేళ ఈ రెండు యూనియన్ల అంతర్గత పోరు ఎటువైపు దారితీస్తుందోనని ఉద్యోగుల్లో చర్చ జరుగుతున్నది.
జలమండలి పరిధిలో ఐదు వేల మందికి పైగా ఉద్యోగులు, కార్మికులు పనిచేస్తుండగా.. ప్రతి రెండేళ్లకోకసారి సంస్థ గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలు జరుగుతాయి. గడిచిన రెండు పర్యాయాలు బీఆర్ఎస్కేవీ యూనియన్‌దే విజయం వరించింది. ఈ నేపథ్యంలోనే ఇటీవల కార్మిక శాఖ ఇప్పటికే మొదటి నోటీసు జారీ చేయగా.. వచ్చే నెల మొదటి వారంలో ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించే అవకాశాలున్నాయి. ఐతే ఎన్నికల నోటిఫికేషన్ వెలువడగా ముందే కాంగ్రెస్ అనుబంధ యూనియన్లు రెండుగా చీలిపోయి చర్చనీయాంశంగా మారింది. మొత్తంగా గుర్తింపు యూనియన్‌గా కార్మికులకు ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు, కార్మికుల అభివృద్ధికి కృషి చేసిన వాటర్‌వర్క్స్ ఎంప్లాయీస్ యూనియన్(బీఆర్ఎస్కేవి)కే వచ్చే ఎన్నికల్లో కార్మికుల మద్దతు ఉంటుందని, గత ఎన్నికల ఫలితాలే పునరావృతం అవుతాయని ఆ యూనియన్ అధ్యక్షుడు రాంబాబు యాదవ్ ఆశాభావం వ్యకం చేస్తున్నారు.