ఆర్కేపురం, డిసెంబర్ 4: ఎల్బీనగర్ కొత్తపేట్లోని ‘కృతుంగ’ రెస్టారెంట్లో బుధవారం వనస్థలిపురానికి చెందిన సందీప్ అతడి స్నేహితులతో కలిసి బిర్యానీ తినేందుకు వచ్చారు. అయితే వారు తినేందుకు చికెన్ బిర్యానీ ఆర్డర్ చేయగా.. అందులో బొద్ధింకలు ప్రత్యక్షమయ్యాయి. బాధితుడు సందీప్ రెస్టారెంట్ మేనేజర్ జానకిరామ్ని ఇది ఏమిటని ప్రశ్నించగా.. ఆయన నిర్లక్ష్యంగా, దురుసుగా సమాధానం ఇచ్చారు.
దీంతో సందీప్ జీహెచ్ఎంసీ ఫుడ్ స్టేఫ్టీ అధికారులకు ఫిర్యాదు చేశారు. వెంటనే ఫుడ్ సేఫ్టీ అధికారి 20 నిమిషాల్లో వస్తానని చెప్పి ఎంతకీ రాకపోవడంతో తిరిగి కస్టమర్ మళ్లీ అతడికి ఫోన్ చేశాడు. సదరు అధికారి ఫోన్ స్విచాఫ్ చేశాడు. దీంతో కస్టమర్ చేసేదిలేక ఆందోళన చేపట్టాడు.
అనునిత్యం ఏదో ఒక హోటల్లో ఇలాంటి ఘటనలు చోటుచేసుకుంటున్నా అధికారుల్లో మాత్రం ఎటువంటి చలనం ఉండటంలేదని, తుతూ మంత్రంగా తనిఖీలు చేపట్టి కఠిన చర్యలు తీసుకోకపోవడంతో ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని వినియోగదారులు ఆరోపిస్తున్నారు.