సిటీబ్యూరో: గ్రేటర్లో ఇటీవల సీఎన్జీ వాహనాలు అధికంగా రిజిస్ట్రేషన్ అవుతున్నాయని ఆర్టీఏ అధికారులు తెలిపారు. ఇదిలా ఉండగా, ఇప్పుడు ఈ గ్యాస్ ధరలు కూడా పెట్రోల్, డీజిల్ ధరల దరిదాపుల్లోకి చేరుతున్నాయని డ్రైవర్లు చెబుతున్నారు. దీంతో సీఎన్జీ ఇంధన కొరత నాలుగు రోజుల నుంచి వెంటాడుతున్నది. నో స్టాక్ బోర్డులు బంకుల్లో దర్శనమిస్తున్నాయి.
ప్రస్తుతం సీఎన్జీ కిలో ధర రూ.97కు చేరింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 450 పైగా పెట్రోల్ బంకులు ఉండగా, అందులో 95 స్టేషన్లలో గ్యాస్ పంపులు అందుబాటులో ఉన్నాయి. మరో 25 కేంద్రాల్లో సీఎన్జీ కేంద్రాలు కొనసాగుతున్నాయి.
ఆర్టీఏ లెక్కల ప్రకారం గ్రేటర్లో సుమారు 80 లక్షలకుపైగా వాహనాలు ఉన్నాయి. అందులో 10.35 లక్షల వరకు కార్లు ఉండగా, 1.46 లక్షల ఆటో రిక్షాలు, 80 వేల క్యాబ్ లు ఉన్నాయి. మొత్తం మీద సుమారు నాలుగు లక్షల వాహనాలు సీఎన్జీ, ఆటో గ్యాస్, లిక్విడ్, ఎల్పీజీ గ్యాస్‌ను వినియోగిస్తున్నట్లు తెలుస్తున్నది. ఆటో గ్యాస్, లిక్విడ్ గ్యాస్‌కు కొరత లేనప్పటికీ సీఎన్జీ పూర్తిస్థాయిలో సరఫరా లేదు.