సిటీబ్యూరో, జూన్ 9 (నమస్తే తెలంగాణ): అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (ఏఈఈ) హోదాలో ఉంటూనే కుటుంబ సభ్యుల పేరిట బినామీ సంస్థను సృష్టించి ఏకంగా కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని కాజేసిన ఇంజనీర్ భాగోతంపై నిగ్గు తేల్చేందుకు సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ సృజన సిద్ధమయ్యారు.
నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్ సమయంలో ఏఈఈగా ఉద్యోగంలో ఉన్న సదరు ఇంజినీరు నిజాంపేట్ డంప్ యార్డ్ నుంచి జవహర్ నగర్ డంప్ యార్డ్‌కు చెత్తను తరలించే (లిఫ్టింగ్) భారీ ప్రక్రియలో కాంట్రాక్టర్‌తో అనధికారిక భాగస్వామ్యంగా ఉండి… స్వయంగా ఎంబీ రికార్డుల (బిల్లులు) నుంచి బిల్లుల డ్రా వరకు చక్రం తిప్పడమే కాకుండా.. తన కుటుంబ సభ్యుల పేర్లతో నకిలీ ఏజెన్సీని సృష్టించి రూ.కోట్లు రూపాయలు మున్సిపల్ నుంచి డ్రా చేసుకున్నాడు.
ఫోర్జరీ డాక్యుమెంట్లు, నకిలీ జీఎస్టీ, పాన్‌కార్డ్‌లను సృష్టించి ఒక దొంగ బ్యాంక్ ఖాతాతో నగదు కొల్లగొట్టిన తీరును ఎండగడుతూ సదరు ఇంజనీర్ అక్రమాలపై మంగళవారం ‘నమస్తే తెలంగాణ దినపత్రిక’లో ‘దొంగ ఖాతాలు.. ఫోర్జరీ పత్రాలు’ శీర్షికన ఏఈఈ లీలలను వెలుగులోకి తీసుకువచ్చింది. ఈ నేపథ్యంలోనే సీఎంసీ ఉద్యోగులు, ఇంజినీరింగ్ వర్గాల్లో ఈ కథనం చర్చనీయాంశంగా మారింది.
ఏఈఈ వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకున్న కమిషనర్ సృజన.. ఈ విషయమై విచారణకు ఆదేశించారు. అదనపు కమిషనర్ (శానిటేషన్) వేణుగోపాల్‌రెడ్డిని విచారణ అధికారిగా నియమించిన కమిషనర్ సృజన త్వరగా నివేదికను అందజేయాలని ఆదేశించారు. ప్రస్తుతం సదరు ఏఈఈ ప్రాజెక్టు విభాగంలో డీఈ హోదాలో ఉన్నారు. ఐతే విచారణ పారదర్శకంగా చేపట్టి బాధిత కాంట్రాక్టర్‌కు న్యాయం చేయాలన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.