Congress | మన్సురాబాద్, ఏప్రిల్ 4: రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పతనం ప్రారంభమైందని మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ తెలిపారు. కాంగ్రెస్ పార్టీని బొంద పెట్టేది సీఎం రేవంత్ రెడ్డియేనని పేర్కొన్నారు. ఎల్బీనగర్ నియోజకవర్గంలోని మన్సూరాబాద్‌లో రంగారెడ్డి అర్బన్ బీజేపీ కార్యాలయ ప్రారంభోత్సవానికి బూర నర్సయ్య గౌడ్ హాజరయ్యారు.
ఈ సందర్భంగా బూర నర్సయ్య గౌడ్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో బీజేపీకి కాంగ్రెస్ పార్టీ సమస్య కాదని అన్నారు. బీఆర్ఎస్తోనే తమకు పోటీ అని తెలిపారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ బలోపేతానికి కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. పార్టీ అభివృద్ధి కోసం కష్టపడి పనిచేసేవారికి ఏదో ఒక సమయంలో సముచిత స్థానం లభిస్తుందని పేర్కొన్నారు. పేదల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి పనులను ప్రజల్లోకి తీసుకెళ్లి పార్టీని మరింత బలోపేతంగా తయారుచేసేందుకు నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని అన్నారు. అనంతరం రంగారెడ్డి జిల్లా అర్బన్ బీజేపీ అధ్యక్షుడిగా నియమితుడైన వనిపల్లి శ్రీనివాస్ రెడ్డిని మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ సన్మానించారు.