CM Revanth Reddy | సిటీబ్యూరో, ఆగస్టు 10(నమస్తే తెలంగాణ) ః నగరాన్ని భారీ వరదలు ముంచెత్తుతుంటే కంటితుడుపు పర్యటనలు… అరకొర ప్రణాళికలతో కాంగ్రెస్ సర్కారు నెట్టుకొస్తుంది. రోగమొకటైతే… మందు ఇంకోటి వేసినట్లుగా క్షేత్రస్థాయి పరిస్థితులను అర్థం చేసుకోకుండానే వరద పర్యటనలను సీఎం రేవంత్ రెడ్డి చేపట్టడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
ఇక అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేస్తూ వరదలు నియంత్రించాలంటూ పదేపదే ప్రస్తావించే ప్రభుత్వ పెద్దలు… స్థానిక నాయకులు లేకుండా పర్యటించి, అసలు సమస్యలు పక్కదోవ పట్టించేలా వ్యవహారించారనే విమర్శలు వస్తున్నాయి. నగర డ్రైనేజీ వ్యవస్థపై ఏమాత్రం అవగాహన లేని కొత్త కొత్త అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి ఆకస్మికంగా పర్యటించినా, వరద ముంపునకు కలిగే ప్రయోజనమేంటనీ ప్రశ్నిస్తున్నారు.
భారీ వరదలతో నగరవాసులు నానా ఇబ్బందులు పడుతున్నారు. ఎడతెరపి లేకుండా కురుస్తున్న వానలతో రోడ్లు, కాలనీలు, బస్తీలు నీట కొలనులు తలపిస్తున్నాయి. మోకాళ్ల లోతు నీటితో నిండిపోయే మూల మలుపులను చూస్తూ వాహనదారులే బెంబెలెత్తిపోతున్నారు. ఇంత జరుగుతున్నా ప్రభుత్వ యంత్రాంగం అవగాహనరాహిత్యం, పాలన వైఫల్యాలను కప్పిపుచ్చుకునేలా కాంగ్రెస్ చేస్తున్న ఆకస్మిక పర్యటనలు ఇప్పుడు నగరవాసులను విస్మయానికి గురిచేస్తున్నాయి.
సుదీర్ఘ కాలంగా తాము ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారం చూపకుండా… పర్యటనలతో ఒరిగేదేమిటనీ విస్తుపోతున్నారు. ఇక నగరంలో వరదల నియంత్రణలో జీహెచ్ఎంసీ, వాటర్బోర్డు ప్రమేయమే లేనట్లుగా… మరే ఇతర శాఖలతో అవసరమే లేనట్లుగా కేవలం హైడ్రాతోనే అన్ని సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని చెప్పుకున్న సీఎం రేవంత్ రెడ్డి… ప్రజలు ఎదుర్కొంటున్న వరద సమస్యలపై మిన్నుకుండిపోయే పరిస్థితులు వచ్చాయి.
రోగం ఒకటి… మందు ఇంకొటి…
ఆదివారం సీఎం రేవంత్ రెడ్డి నీట మునిగిన అమీర్పేట్ ప్రాంతంలో పలు ప్రాంతాల్లో పర్యటించారు. ముంపునకు గురైన అమీర్పేట్, గంగూభాయి బస్తీ, మైత్రీవనం, బుద్ధ నగర్ ప్రాంతాల్లో హైడ్రా, బల్దియా అధికారులతో కలిసి సందర్శించారు. గంటపాటు జరిగిన సీఎం పర్యటనలో తమ ఇండ్లలోకి వస్తున్న వరదకు మోక్షమెప్పుడూ సీఎం ఎదుట ప్రస్తావించారు. కానీ ఈ పర్యటనతో ఆ ప్రాంతానికి ఒరిగేదేమి లేదనే అభిప్రాయాన్ని స్థానికులు వ్యక్తం చేస్తున్నారు.
సనత్ నగర్ నియోజకవర్గం పరిధిలో ఉన్న ఈ ప్రాంతాలను 2020లోనూ వరదలు ముంచెత్తాయి. ఈ సందర్భంలోనే అప్పటి బీఆర్ఎస్ సర్కారు ఎస్ఎన్డీపీలో భాగంగా నాలాను అభివృద్ధికి చర్యలు చేపట్టారు. మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అత్యంత ప్రాధాన్యత అంశంగా తీసుకుని గాయత్రీ నగర్ నాలాను విస్తరించారు.
ఏడాది లోపే 80శాతం పనులు పూర్తి కాగా, కాంగ్రెస్ అధికారంలోకి రావడంతోనే ఆ పనులు నిలిచిపోయాయి. దీంతో నాలా వెంబడి తొలగించిన ఆక్రమణలు మళ్లీ రావడంతో.. ఇప్పుడు ఎక్కడి సమస్య అక్కడే ఉంది. దీంతో అక్కడి నుంచి మొదలయ్యే వరద ప్రభావిత ప్రాంతం అమీర్పేట్, మైత్రీవనం దాటి బల్కంపేట్ వరకు విస్తరిస్తోంది. కానీ సీఎం ఆ అంశాన్ని కూడా ప్రస్తావించకుండా పర్యటించడంతో సమస్యకు పరిష్కారం దొరుకుతుందా అని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
మా ఇంటికి వరదను ఆపండి సారూ..
ఇక బస్తీలో పర్యటించిన క్రమంలో స్థానికులతో సంభాషిస్తున్న సమయంలో సీఎం రేవంత్ రెడ్డికి ఏడో తరగతి చదివే ఓ బాలుడి నుంచి ఊహించనీ ప్రశ్న ఎదురైందనీ స్థానికులు తెలిపారు. తన ఇంటి నుంచి కాలనీలోకి వచ్చే వరదకు పరిష్కారంగా పెద్ద డోర్లు ఏర్పాటు చేయాలంటూ కోరగా, త్వరలోనే సమస్యను పరిష్కరిస్తానంటూ సీఎం రేవంత్ రెడ్డి సర్ధి చెప్పారు.
కనీసం వరద నీరు త్వరగా పోయేందుకు ప్రస్తుతం ఉన్న డ్రైన్ వాటర్ లైన్లను విస్తరించాలని స్థానికులుడిమాండ్ చేశారు. గతంలో ఈ తరహా సమస్యలు లేవని, అసంపూర్ణంగా నాలా పనులు నిలిచిపోవడంతోనే ఈ ఇబ్బందులు వస్తున్నాయని, వానకాలం పూర్తయ్యేంత వరకు భయాందోళనలకు గురికావాల్సి వస్తుందంటూ వివరించారు.
చెరో దారిలో సీఎం, మంత్రి…
ఇక సీఎం రేవంత్ రెడ్డి స్థానిక ఎమ్మెల్యేలు లేకుండా ఆకస్మిక పర్యటన పేరిట హడావుడి చేస్తే… ఇన్చార్జి మంత్రి పొన్నం తనకు తానుగా బల్దియా ప్రధాన కార్యాలయంలో వరదలపై సమీక్షించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. బల్దియా కమిషనర్ లేకుండా సీఎం పర్యటిస్తే… హైడ్రా కమిషనర్ లేకుండానే మంత్రి పొన్నం నగర వరదలపై సమీక్షించారంటూ పలువురు కార్పొరేటర్లు వాపోతున్నారు. కనీసం వరద ప్రభావిత ప్రాంతాల్లో ఉండే కార్పొరేటర్లను భాగస్వామ్యం చేయడం వలన సత్వర సమస్యలకుపరిష్కారం ఉంటుందని పేర్కొన్నారు.