సిటీబ్యూరో, డిసెంబర్ 13 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ విశ్వనగరంగా ఎదుగుతున్న క్రమంలో అన్ని ప్రాంతాలకు మెట్రో రవాణా సౌకర్యం కల్పించాలని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. ఓఆర్ఆర్ చుట్టూ శాటిలైట్ టౌన్ షిప్‌లు భవిష్యత్‌లో వచ్చే అవకాశం ఉండటంతో మెట్రో రైలు సౌకర్యం కీలకపాత్ర పోషిస్తుందని తెలిపారు. బుధవారం హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టుపై సీఎం రేవంత్‌రెడ్డి సచివాలయంలో సమీక్ష నిర్వహించారు.
విశ్వనగరంగా మారుతున్న హైదరాబాద్ మహానగరంలో భవిష్యత్ ప్రజా రవాణా వ్యవస్థలను కల్పించేందుకు కేసీఆర్ ప్రభుత్వం భారీ ఎత్తున మెట్రో విస్తరణ ప్రణాళికలను రూపొందించింది. దీనికి సంబంధించిన పనులు పురోగతిలో ఉన్న సమయంలో రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు కావడంతో మెట్రో రైలు ప్రాజెక్టు విస్తరణ పనులపై సీఎం రేవంత్ రెడ్డి మెట్రో రైలు ఎం.డీ ఎన్వీఎస్ రెడ్డితో పాటు ఇతర అధికారులతో ప్రత్యేకంగా సమీక్షించారు.
ప్రస్తుతం మొదటి దశ మెట్రో ప్రాజెక్టు ఏవిధంగా ప్రజలకు అందుబాటులో ఉన్నదని, ఏ మేరకు ప్రజా రవాణా వ్యవస్థకు దోహదం చేస్తున్నదని మెట్రో అధికారులను అడిగి తెలుసుకున్నారు. నగర వాసుల నుంచి మెట్రోకు విశేష ఆదరణ ఉన్నదని, ముఖ్యంగా ఐటీ కారిడార్‌కు వెళ్లేందుకు ప్రతి రోజు లక్షలాది మంది ఐటీ ఉద్యోగులు, ఇతరులు మెట్రోలోనే ప్రయాణం చేస్తున్నారని మెట్రో అధికారులు సీఎంకు వివరించారు. 69 కి.మీ మేర ఉన్న మూడు కారిడార్లలో కలిపి ప్రతి రోజు మెట్రోలో 5 లక్షలకు పైబడి ప్రయాణికులు రాకపోకలు సాగిస్తున్నారని తెలిపారు.
మొదటి దశపై పవర్‌పాయింట్ ప్రజంటేషన్ ద్వారా సీఎంకు వివరించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ఎయిర్‌పోర్టుకు మెట్రో రైలు మార్గం 111జీవో పరిధిలో ఉన్నదని, ఇక్కడ అభివృద్ధికి పరిమితులు ఉన్నాయని తెలిపారు. ఎయిర్‌పోర్టుకు మెట్రో లైన్ వెంటనే చేపట్టాల్సిన అవసరం లేదని అధికారులకు సూచించారు. హైదరాబాద్ నగరం నలు దిక్కులా శరవేగంగా విస్తరిస్తున్నదని, 111 జీవో పరిధిలోని మెట్రో లైన్ కాకుండా అన్ని దిక్కులా విస్తరించేలా చర్యలు చేపట్టాలని అన్నారు. ముఖ్యంగా కోర్ సిటీ, తూర్పు, పాత బస్తీ వైపు విస్తరించాలన్నారు. ప్రస్తుతం ప్రతిపాదనలో ఉన్న ఎయిర్పోర్ట్ మెట్రో అలైన్‌మెంట్‌ను ఓల్డ్ సిటీ మీదుగా ఎంజీబీఎస్, ఫలక్‌నుమా, ఎల్బీ నగర్ ప్రాంతాలను కలుపుతూ నిర్మించేలా చూడాలన్నారు.
ఎయిర్‌పోర్టు మెట్రో కొత్త మార్గాల ప్రతిపాదన
సమీక్షా సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి మెట్రో అధికారులకు రెండు కొత్త మార్గాలపై దిశానిర్దేశం చేశారు. ఒక మార్గాన్ని ఎంజీబీఎస్, ఫలక్‌నుమా నుంచి.. రెండవ మార్గాన్ని ఎల్బీ నగర్ వయా చాంద్రాయణగుట్ట మీదుగా తీసుకోవాలని సూచించారు. ఇందులో మైలార్‌దేవ్‌పల్లి, జల్పల్లి, పీ 7 రోడ్డు మీదుగా ఎయిర్పోర్ట్ వరకు.. మరొకటి వయా బార్కాస్, పహడీషరీఫ్, శ్రీశైలం రోడ్డు మీదుగా ఎయిర్‌పోర్టు మార్గాలను పరిశీలించాలని సూచించారు. సమీక్షా సమావేశంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో పాటు సీఎస్ శాంతికుమారి, పురపాలక శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అర్వింద్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
కందుకూరు సమీపంలో ఫార్మా సిటీ కోసం సేకరించిన స్థలంలో మెగా టౌన్ షిప్‌నకు ప్రణాళికలు రూపొదించాలని సీఎం రేవంత్‌రెడ్డి అధికారులకు సూచించారు. కాలుష్య కారకమైన ఫార్మా సిటీ హైదరాబాద్‌కు సమీపంలో ఉన్నదని.. దీనిని నగరానికి దూరంగా ఏర్పాటు చేయాలని అభిప్రాయపడ్డారు. విమానాశ్రయ ప్రాంతం నుంచి శ్రీశైలం రోడ్డులోని తుక్కుగూడ మీదుగా కొత్త నగరానికి మెట్రో రైలు కనెక్టివిటీ ప్లాన్ చేయాలని హెచ్ఎంఆర్ఎల్ ఎండీని ఆదేశించారు.