ఉస్మానియా యూనివర్సిటీ, డిసెంబర్ 6: తెలంగాణ రాష్ర్టానికే తలమానికమైన ఉస్మానియా యూనివర్సిటీని ప్రపంచ స్థాయిలో అభివృద్ధి చేస్తామని సాక్షాత్తూ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఓయూ గడ్డపై గతంలో ప్రకటించారు. అవసరమైతే రూ. వెయ్యి కోట్లు మంజూరు చేస్తానని, అవసరమైన అన్ని మౌలిక వసతులు, ఇతర అభివృద్ధి పనులకు సంబంధించిన వాటికి డీపీఆర్‌లు తయారు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. మరో రెండు రోజుల్లో ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో దీనిపై క్యాంపస్‌లో తీవ్ర చర్చ నడుస్తోంది. అధికారులు వన్‌సైడెడ్‌గా డీపీఆర్‌లు తయారు చేశారని ఆరోపిస్తున్నారు. కనీసం డీపీఆర్‌ల రూపకల్పనలో విద్యార్థులను ఎవరినీ సంప్రదించలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కమిషన్లు వచ్చే పనులకే అధికారులు పెద్ద పీట వేశారని విద్యార్థులు మండిపడుతున్నారు. త్వరలో రానున్న నిధుల్లో భాగంగా వర్సిటీలో ఏం నిర్మిస్తారో, ఏం అభివృద్ధి పనులు చేపడతారోనని విద్యార్థులు చర్చించుకుంటున్నారు. కనీసం తమకు అవసరమైన వసతులు, ఇతర వనరుల గురించి అధికారులెవరూ కనీసం ప్రస్తావించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వెయ్యి కోట్ల విలువైన అభివృద్ధి పనులు చేసే సమయంలో విద్యార్థులకు అసవరమైన వాటిని అడిగి తెలుసుకోవడం కనీస నైతిక బాధ్యత అని వ్యాఖ్యానిస్తున్నారు.
డీపీఆర్ రూపొందించేందుకు ఏమైనా కమిటీలు ఏర్పాటు చేశారా, లేనిపక్షంలో ఉన్నతాధికారుల విచక్షణ ఆధారంగా డీపీఆర్‌లు తయారు చేశారా స్పష్టం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. డీపీఆర్‌లపై ఎందుకు గోప్యత పాటిస్తున్నారని ప్రశ్నిస్తున్నారు. సాధారణ విద్యార్థులకు ఉపయోగపడని మౌలిక వసతుల కల్పనకు ఎన్ని వేల కోట్లు ఖర్చుపెట్టినా ఫలితం శూన్యమని వాపోతున్నారు. అది కేవలం కమిషన్ల ద్వారా అధికారుల స్వీయ ప్రయోజనాలకే ఉపయోగపడుతుందని అభిప్రాయపడుతున్నారు.
ఉద్యమిస్తామంటూ…హెచ్చరిక సాక్షాత్తూ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన విద్యా కమిషన్ సైతం విద్యార్థి సంఘాల ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వానికి గట్టిగా సిఫార్సు చేస్తున్నప్పటికీ, ఉస్మానియా యూనివర్సిటీలో మాత్రం పరిస్థితి దానికి విరుద్ధంగా ఉంది. ప్రస్తుత వీసీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి విద్యార్థి సంఘాలను కనీసం పరిగణనలోకి తీసుకోవడం లేదు. దీనిపై విద్యార్థి సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. అవసరమైతే అన్ని విద్యార్థి సంఘాలతో కలిసి అధికారుల నియంతృత్వ విధానాలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరిస్తున్నాయి.
ఎవరినీ కలవకుండా.. నిరంకుశ పాలన
ఓయూ వీసీ ప్రొఫెసర్ కుమార్ బాధ్యతలు తీసుకున్న తరువాత నుంచి ఎవరినీ కలవకుండా నిరంకుశ పాలన సాగిస్తున్నారని ఆరోపిస్తున్నారు. వర్సిటీలోని అధ్యాపకులతో మొదలుకుని కాంట్రాక్ట్, టైంస్కేల్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులు, విద్యార్థులు తదితర అన్ని వర్గాలు తమ సమస్యలపై వినతిపత్రాలు అందజేయాలని ప్రయత్నించినా, కనీసం సమయం ఇవ్వకపోవడంతో రిజిస్ట్రార్, ఓఎస్డీలకు వినతిపత్రాలు ఇవ్వాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కనీసం సమస్యలు వినే తీరిక లేని వైస్ చాన్స్‌లర్‌కు సమస్యల గురించి తెలుసుకోవాలని రేవంత్‌రెడ్డి ఆదేశించాలని కోరుతున్నారు.