సిటీబ్యూరో/కేపీహెచ్బీ కాలనీ, ఏప్రిల్ 15 (నమస్తే తెలంగాణ): కేపీహెచ్బీ కాలనీ 15వ ఫేజ్లో హౌసింగ్ బోర్డు స్థలాన్ని అప్రోచ్ రోడ్డుగా చూపించి జీహెచ్ఎంసీ నుంచి భారీ భవన నిర్మాణానికి అనుమతి పొందిన అంశం చర్చనీయాంశమైంది. మూసాపేట సర్కిల్ పరిధిలోని కేపీహెచ్బీ కాలనీ ఫేజ్-15లో ‘హౌసింగ్ బోర్డు స్థలం నాదే..దరఖాస్తు చేసుకున్న బిల్డర్-అప్రోచ్ రోడ్డు లేకుండా భారీ భవంతికి అనుమతి అన్న శీర్షికన ‘నమస్తే తెలంగాణ’లో మంగళవారం కథనాన్ని ప్రచురించింది. ఈ కథనానికి రాష్ట్ర ముఖ్యమంత్రి కార్యాలయం స్పందించింది.
ఈ అనుమతులపై వెంటనే పూర్తిస్థాయిలో నివేదికను అందజేయాలని జీహెచ్ఎంసీ, హౌసింగ్ బోర్డు అధికారులకు సీఎంవో కార్యాయల అధికారులు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిసింది. జీహెచ్ఎంసీ జోనల్ కార్యాలయం నుంచి గతంలో అనుమతి పొందిన మూడు భవనాలకు సంబంధించిన పర్మిషన్లపై ఆరా తీశారు. కూకట్పల్లి జోనల్ కార్యాలయం నుంచి పొందిన అనుమతులు నిబంధనల ప్రకారం రద్దు చేయనున్నట్లు అధికార వర్గాలు పేర్కొన్నాయి. హౌసింగ్ బోర్డు స్థలం అన్యాక్రాంతం కాకుండా ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, కార్పొరేటర్ పగడాల శిరీష బాబురావులు స్పందించడంపై స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.