‘దళిత బంధు’ లబ్ధిదారుల మనోగతం ఆదాయ మార్గాలపై పూర్తయిన అవగాహన శిక్షణ
మార్చి 10లోపు యూనిట్ల కొనుగోలుకు లబ్ధిదారుల ఖాతాలలోకి నగదు
యూనిట్ల మార్పునకు 10లోపు లబ్ధిదారులకు అవకాశం
మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లాలో 500ల మంది లబ్ధిదారులు
మేడ్చల్, ఫిబ్రవరి 25(నమస్తే తెలంగాణ): దళితుల అభ్యున్నతి కోసం టీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ‘దళిత బంధు’ పథకాన్ని తీసుకువచ్చి అమలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ పథకంలో భాగంగా నియోజకవర్గానికి 100 మంది చొప్పున లబ్ధిదారులను ఎంపిక చేసి పలు రకాల ఆదాయ మార్గాలలో ఉన్నతిని సాధించేందుకు శిక్షణ ఇచ్చారు. అయితే, ఇలా ఎంపికైన లబ్ధిదారులకు మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా పరిధిలో శుక్రవారంతో శిక్షణ తరగతులు పూర్తయ్యాయి. మార్చి 10వ తేదీలోపు లబ్ధిదారులు ఎంపిక చేసుకున్న యూనిట్ల కొనుగోలుకు లబ్ధిదారుల ఖాతాలలో నగదును జమ చేయనున్నారు. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా వ్యాప్తంగా ఎంపిక చేసిన 500ల మంది లబ్ధిదారులకు అవగాహన కల్గించారు. దళితుల అభివృద్ధికి ప్రభుత్వం దళిత బంధు పథకం ద్వారా అందిస్తున్న రూ.10 లక్షలను సద్వినియోగం చేసుకుని వివిధ వ్యాపారాలలో వృద్ధి సాధించాలని సూచించారు. రూ.10 లక్షల నిధులతో ఏర్పాటు చేసుకునే విధంగా రూపొందించిన 96 యూనిట్ల జాబితాను లబ్ధిదారులకు అందజేశారు.
యూనిట్లలో మార్పులు చేసుకునే అవకాశం..
దళిత బంధు లబ్ధిదారులు ఏర్పాటు చేసుకునే యూనిట్లలో మార్పులు చేసుకునే అవకాశం కల్పించారు. లబ్ధిదారులందరూ ఒకే వ్యాపారాన్ని ఎంచుకోకుండా ఎస్సీ కార్పొరేషన్ రూపొందించిన జాబితాలో ఉన్న యూనిట్లను ఎంపిక చేసుకుని వ్యాపారాలను ఎంపిక చేసుకోవాలని సూచిస్తున్నారు. పరిశ్రమల శాఖ అధికారులు ప్రత్యేకంగా రూపొందించిన ప్రకారం, పరిశ్రమలు ఏర్పాటు చేసుకుంటే వ్యాపారాలు వృద్ధి చెందుతాయని అధికారులు లబ్ధిదారులకు శిక్షణ తరగతులలో వివరించారు.
దళితులపై సీఎం కేసీఆర్‌ది నిజమైన ప్రేమ..
దళితులపై ముఖ్యమంత్రి కేసీఆర్‌కు నిజమైన ప్రేమ ఉందని తేలింది. ఇందుకు నిదర్శనమే దళిత బంధు పథకం. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణలో దళితబంధు పథకంతో దళితులు వ్యాపారాలు నిర్వహించుకునే విధంగా అవకాశం లభించింది. రాష్ట్రంలోని దళితులందరూ ముఖ్యమంత్రికి రుణపడి ఉంటారు.
– డప్పు గిరిబాబు, చర్లపల్లి