నిరుపేదలు ఆత్మగౌరవంతో బతకాలనే లక్ష్యంతో సీఎం కేసీఆర్ సంకల్పంతో జీహెచ్ఎంసీ పరధిలో లక్ష డబుల్ బెడ్ రూం ఇండ్లు సాకారం అవుతున్నాయి. గ్రేటర్‌లోని పేదలకు నేటి నుంచి రెండు నెలలపాటు డబుల్ ఇండ్ల పండుగే రాబోతున్నది. అందులో భాగంగా కొల్లూరులో నిర్మించిన ‘కేసీఆర్ నగర్ 2 బీహెచ్‌కే డిగ్నిటీ హౌసింగ్ కాలనీ’ని సీఎం కేసీఆర్ గురువారం ప్రారంభించనున్నారు. ఈ కాలనీలో ఒకే రోజు 15, 660 ఇండ్లు అందుబాటులోకి వస్తున్నాయి. జీహెచ్ఎంసీ పరిధిలో 111 ప్రాంతాలకు గాను రెండు చోట్ల మినహా ఈ రెండు పడక గదుల ఇండ్ల నిర్మాణం ప్రాజెక్టు తుది దశకు చేరుకున్నది. ఇప్పటికే 5,660 గృహాలను లబ్ధిదారులకు పంపిణీ చేయగా, మరో 62,516 ఇండ్లు పంపిణీకి చకచకా ఏర్పాట్లు చేస్తున్నారు. 3,54,967 దరఖాస్తులు సరైనవిగా తేల్చిన అధికారులు 150 వార్డుల్లో 150 బృందాలను ఏర్పాటు చేసి అర్హులను గుర్తించే పనిలో ఉన్నారు. ఈ అర్హుల జాబితా నుంచి లాటరీ ద్వారా లబ్ధిదారులను కలెక్టర్లు ఎంపిక చేసి డబుల్ ఇండ్లను అందజేయనున్నారు.
– సిటీబ్యూరో, జూన్ 21 (నమస్తే తెలంగాణ )
సిటీబ్యూరో, జూన్ 21 (నమస్తే తెలంగాణ ) : నిరుపేదలు ఆత్మగౌరవంతో బతకాలనే లక్ష్యంతో సీఎం కేసీఆర్ జీహెచ్ఎంసీ పరిధిలో ఎంపిక చేసిన 111 ప్రాంతాల్లో నిర్మించిన లక్షా డబుల్ బెడ్ రూం ప్రాజెక్టు తుది దశకు చేరుకుని..లక్ష్యం సాకారం దిశగా అడుగులు పడుతున్నాయి. నేడు ఒకే రోజు 15,660 ఇండ్లు అందుబాటులోకి వస్తున్నాయి. అత్యాధునిక సౌకర్యాలతో కొల్లూరులో నిర్మించిన ‘ కేసీఆర్ నగర్ 2 బీహెచ్‌కే డిగ్నిటీ హౌసింగ్ కాలనీ’ని సీఎం కేసీఆర్ గురువారం ఉదయం 10 గంటలకు ప్రారంభించి లబ్ధిదారులకు ఇండ్ల పంపిణీ చేయనున్నారు. కాగా, ఈ ప్రాజెక్టుకు 22 ఫిబ్రవరి 2018న శ్రీకారం చుట్టి విడతల వారీగా అందుబాటులోకి తీసుకువచ్చి లబ్ధిదారులకు ఇండ్ల పంపిణీ చేస్తున్నారు. 111 ప్రాంతాలకు గానూ రెండు ప్రాంతాలు మినహా ఈ రెండు పడక గదుల ఇండ్ల నిర్మాణం ప్రాజెక్టు తుది దశకు చేరుకుని..ఆత్మగౌరవంతో పేదలు బతికేలా కార్పొరేట్ స్థాయి ఇంటిని ఉచితంగా అందిస్తున్నది.
ఇప్పటికే .5,660 గృహాలను లబ్ధిదారులకు పంపిణీ చేయగా..62,516 ఇండ్లు పంపిణీకి చకచకా ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రస్తుతం 7,09,718 దరఖాస్తులను స్వీకరించిన అధికారులు 3,54,967 దరఖాస్తులు సరైనవిగా తేల్చారు. దరఖాస్తులను పరిశీలించిన రెవెన్యూ అధికారులు అర్హులను ఎంపిక చేసేందుకు 150 వార్డులకు గానూ 150 బృందాలను ఏర్పాటు చేశారు. రెవెన్యూ టీమ్‌లు క్షేత్రస్థాయిలో పరిశీలించి అర్హులను ఎంపిక చేయనున్నారు. అర్హులను ఎంపిక చేశాక..వారిలో నుంచి లాటరీ ద్వారా లబ్ధిదారులను సంబంధిత జిల్లాల కలెక్టర్లు గుర్తిస్తారు. వచ్చే రెండు నెలల పాటు పేదలకు డబుల్ ఇండ్ల పండగను ప్రభుత్వం సాకారం చేయనుంది. ఒక హాలు, రెండు పడక గదులు, వంట గది, రెండు మరుగుదొడ్లు గల ఇంటి విస్తీర్ణం 560 చదరపు అడులు కాగా, ఒక్కో ఇంటికి రూ.8.65 లక్షలుగా ఖర్చు చేసి ఉచితంగా అందజేస్తున్నారు. అంతేకాకుండా సముదాయాల్లోనే షాపింగ్ కాంప్లెక్స్‌లను నిర్మించి వాటి ద్వారా వచ్చే అద్దెలను నిర్వహణకు ఉపయోగించుకునే అవకాశాన్ని కల్పించారు.
సాకారమవుతున్న ప్రభుత్వ లక్ష్యం
జీహెచ్ఎంసీలో నివసించే నిరుపేదల కోసం 111 లోకేషన్ల లక్ష డబుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణానికి మొత్తం ప్రాజెక్టు వ్యయం రూ.9714.59 కోట్లు కాగా అందులో 6,867 కోట్ల ఖర్చుతో 98వేల డబుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణాలు చేపట్టారు. అందులో 68,176 ఇండ్లను 71 లోకేషన్లలో పూర్తి చేశారు. మిగతా గృహాలు 38 లోకేషన్లలో వివిధ దశలో పురోగతిలో ఉన్నాయి. రెండు లొకేషన్లలో 2,026 గృహాలు వివిధ కారణాలతో నిర్మాణాలను చేపట్టలేకపోయినట్లు అధికారులు వెల్లడించారు. కాగా, 42 లోకేషన్లలో చేపట్టిన 62,516 రెండు పడకల గదులు పూర్తయి ప్రారంభానికి సిద్ధంగా ఉన్నట్లు అధికారులు స్పష్టం చేశారు. మరో 29 లొకేషన్లలో నిర్మించి పేదల పాత గృహాలను తొలగించి కొత్త గృహాలను నిర్మించగా..5,660 గృహాలను లబ్ధిదారులకు పంపిణీ చేశారు.
17 ప్రాంతాల్లో ఉన్న చోటనే కలల సౌధం
జీహెచ్ఎంసీ ఇంప్లిమెంట్ ఏజెన్సీగా వ్యవహరించింది. డబుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణం ప్రత్యేకంగా జీహెచ్ఎంసీ పరిధిలో అర్హులైన లబ్ధిదారులకు ఉచితంగా పంపిణీ చేస్తున్నారు. ఈ డబుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణం వేకెంట్ ల్యాండ్.. గతంలో ఉన్న ఇన్‌సీటు ప్రదేశాల్లో ఇండ్లను తొలగించి కొత్త నిర్మాణాలు చేపట్టారు. అప్పటి వరకు ఇరుకైన బస్తీల్లో ఉండే ప్రజలను ఒప్పించి అక్కడి నుంచి ఖాళీ చేయించి సకల సదుపాయాలతో అపార్ట్మెంట్ నిర్మాణాలు చేపట్టారు. ఈ నేపథ్యంలో సకల సౌకర్యాలతో ప్రతి గృహంలో రెండు బెడ్ రూంలు, ఒక కిచెన్, రెండు మరుగుదొడ్లతో మొత్తం 560 స్కేర్ ఫీట్లలో గృహ నిర్మాణం చేపట్టారు.
పేరుకే జేఎన్ఎన్యూఆర్ఎం-అంతా నాసిరకం
గత ప్రభుత్వాల హయాంలో జేఎన్ఎన్యూఆర్ఎం పథకం ద్వారా నగరంలో మూడు దశల్లో మొత్తం 46, 629 గృహాల నిర్మాణానికి రూ.1088.55కోట్ల రూపాయలు మంజూరు చేసింది. గ్రేటర్ పరిధిలో 45,951 గ్రౌండ్ చేశారు. అందులో 31, 187 గృహాలు రూ. 725.55కోట్ల వ్యయంతో పూర్తయ్యాయి. అందులో 17,546 మంది లబ్ధిదారులకు గృహాలను పంపిణీ చేశారు. మరో 13,641 గృహాలు ప్రజలు ఆసక్తికనబర్చనందున ఖాళీగా ఉంచారు. 2014లో 14,076 గృహాలను రూ. 204.41కోట్ల వ్యయంతో పూర్తి చేయగా..ఈ పథకం ద్వారా నిర్మించిన గృహాల్లో కేవలం 26,063 గృహాలను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. గత ప్రభుత్వాలు నాసిరకంతో జేఎన్ఎన్ఆర్ఎం ఇండ్ల నిర్మించడమే ఇందుకు కారణమన్న ఆరోపణలు బలంగా వినిపించాయి.
ప్రత్యేక మౌలిక వసతులు