రంగారెడ్డి, ఆగస్టు 25, (నమస్తే తెలంగాణ): జిల్లా తెలంగాణకే బంగారు కొండ… ఇక్కడ రెండు ఎకరాలున్న రైతు పెద్ద కోటీశ్వరుడని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అన్నారు. కొంగరకలాన్‌లో 44 ఎకరాల్లో రూ.58కోట్ల వ్యయంతో నిర్మించిన సమీకృత కలెక్టరేట్‌ను గురువారం సీఎం కేసీఆర్ ప్రారంభించారు. కలెక్టరేట్ భవన సముదాయం కలియ తిరిగిన సీఎం ఆదిత్యాత్మక రుద్ర పూజలో పాల్గొన్నారు. అనంతరం కలెక్టర్ డి.అమయ్‌కుమార్‌ను సీఎం కేసీఆర్ చాంబర్లో కూర్చోబెట్టి, ఆశీర్వదించారు. ఈ సందర్భంగా సర్వమత ప్రార్థనలు చేసి, కలెక్టరేట్ నిర్మాణంలో భాగస్వాములైన వారిని సన్మానించారు. అనంతరం బహిరంగ సభలో ముఖ్యమంత్రి ప్రసంగించారు. ఆ వివరాలన్నీ ఆయన మాటల్లోనే…
తెలంగాణ వస్తే రంగారెడ్డి జిల్లాలో భూముల ధరలు పడిపోతాయని ఉద్యమ సమయంలో తప్పుడు ప్రచారం చేశారు. కానీ ఈ రోజు భూముల ధరలు కోట్లలో పెరిగిపోయినయి. రైతులు బాగుపడ్డరు. హైదరాబాద్‌లో ఐటీ రంగం దూసుకుపోయి 1.55 లక్షల మందికి ఉద్యోగాలొస్తే, బెంగళూరులో మతపిచ్చి చేసి అక్కడ వాతావరణాన్ని కలుషితం చేస్తే ఉన్న ఉద్యోగాలు పోతున్నయి.
తెలంగాణలో కూడా వచ్చే పరిశ్రమలు, ఐటీ పరిశ్రమలు తరలిపోవాలా..? రంగారెడ్డి జిల్లా భూముల ధరలు పడిపోవాలా..?
మతపిచ్చిగాళ్లు చిల్లర రాజకీయాల కోసం రాష్ర్టాన్ని అల్లకల్లోలం చేస్తే చూస్తూ ఊరుకోవాలా ? హైదరాబాద్‌తోపాటు రాష్ట్రమంతా ప్రశాంత వాతావరణంలో అభివృద్ధి జరుగుతున్నది. ఈ మతపిచ్చిగాళ్లు, చిల్లరగాళ్లు, దుర్మార్గులు ఏం చేస్తున్నారనేది ప్రజలు ఆలోచన చేయాలి. మన ఐక్యత దెబ్బతింటే… మోసపోతే… గోస పడుతాం. వందేండ్లు ఆగమైతాం. పట్టణ, పల్లెప్రగతి, హరితహారం వంటి కార్యక్రమాలతో తెలంగాణ అద్భుతంగా ముందుకుపోవాలి. తెలంగాణను ఆదర్శంగా ఉంచడంలో బుద్ధిజీవులు, మేధావులు ముందుండాలి. అందులోనూ రంగారెడ్డి జిల్లా ప్రజలు చైతన్యవంతులు కాబట్టి మీరు ముందుండాలి. ఈ తాండూరు దాటితే పక్కనే కర్నాటక రాష్ట్రం వస్తది. ఎమ్మెల్యేలు నియోజకవర్గానికి 500 మందిని తీసుకుపోయి అక్కడ చూపించండి. ఆ రాష్ట్రంలో కల్యాణలక్ష్మి లేదు, షాదీముబారక్ లేదు, రైతుబంధు, రైతుబీమా లేదు. మనం ఇవన్నీ చేస్తున్నా మనపై కాలు దువ్వుతున్నారు. ఇలాంటి స్వార్థ, నీచ, మతపిచ్చిగాళ్లను ఎక్కడిక్కడ తరిమికొట్టాలె. కృష్ణా జలాల్లో వాటా తేల్చమని వంద దరఖాస్తులు ఇచ్చినా… కేంద్రం నుంచి ఉలుకూపలుకు లేదు. సుప్రీంకోర్టులో కేసు వేసినం. ఉపసంహరించుకుంటే నీళ్లిస్తామన్నారు. ఏడాదైనా సప్పుడు లేదు. కేంద్రంలోని ఈ ప్రభుత్వాన్ని సాగనంపితేనే మనకు సాగు నీరొస్తది. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా సంక్షేమ పథకాలు, రైతులను ఆదుకునే పథకాలను తెలంగాణలో అమలుచేస్తున్నాం. రైతుబీమా పథకం ప్రపంచంలోనే ఎక్కడాలేదు. రైతు మరణిస్తే వారం రోజుల్లో సంబంధిత రైతు కుటుంబ సభ్యుల బ్యాంకు ఖాతాల్లో రూ.5 లక్షల ఆర్థిక సహాయం జమ చేస్తున్నాం. రైతులు పండించిన ప్రతీ ధాన్యాన్ని కొనుగోలు చేసి, రెండు రోజుల్లో రైతుల బ్యాంకు ఖాతాల్లో నగదు జమ చేస్తున్నాం.
ఒక్కో నియోజకవర్గానికి అదనంగా రూ. 10 కోట్లు
వికారాబాద్, రంగారెడ్డి, మేడ్చెల్ జిల్లాలు హైదరాబాద్ నగర మున్సిపాలిటీలతో కలిసి ఉంటాయి. వికారాబాద్‌లో ప్రకటన చేయడం మర్చిపోయాను. మేడ్చల్ జిల్లాలో ప్రకటించాను. మంత్రి సబితా, ఎంపీ రంజిత్‌రెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్షులు మంచిరెడ్డి కిషన్‌రెడ్డి కోరిండ్రు. అన్నా మీరు మేడ్చల్‌లో ఎలాగైతే డబ్బులు ఇచ్చారో మాకు కూడా ఇవ్వాలని పైసలు అడిగిండ్రు. మీ కోసం వాళ్లు అడిగారు. ఇలాంటి నాయకులు ఉండాలె. మీ కోసం వికారాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ ఈ మూడు జిల్లాలకు కూడా గతంలో ఒక్కో ఎమ్మెల్యేకు రూ. 5 కోట్లు ఇచ్చాను. ఇప్పుడు ఒక్కో నియోజకవర్గానికి ఇంకో రూ. 10 కోట్లు మంజూరు చేస్తున్నాను. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు కూడా జారీ చేస్తాం. ఈ డబ్బులతో మిగిలిపోయిన పనులేమైనా ఉంటే చేసుకుని, బ్రహ్మాండంగా అభివృద్ధి చేసుకోవాలి.
ఈ కార్యక్రమంలో సీఎస్ సోమేశ్‌కుమార్, రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, చేవెళ్ల ఎంపీ గడ్డం రంజిత్ రెడ్డి, ఎమ్మెల్సీలు పట్నం మహేందర్ రెడ్డి, పల్లా రాజేశ్వర్ రెడ్డి, వాణీదేవి, నవీన్‌కుమార్, కసిరెడ్డి నారాయణ రెడ్డి, యెగ్గె మల్లేశం, బోగారపు దయానంద్, ఎమ్మెల్యేలు కాలే యాదయ్య, దేవిరెడ్డి సుధీర్ రెడ్డి, అంజయ్యయాదవ్, జైపాల్ యాదవ్, ప్రకాశ్‌గౌడ్, అరికెపూడి గాంధీ, మహేశ్‌రెడ్డి, మెతుకు అనంద్, జీవన్‌రెడ్డి, బాల్క సుమన్, జడ్పీ చైర్పర్సన్ తీగల అనితారెడ్డి, డీసీసీబీ చైర్మన్ బి.మనోహర్ రెడ్డి, మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్, మాజీ ఎమ్మెల్యేలు తీగల కృష్ణారెడ్డి, కేఎస్ రత్నం, మాజీ మేయర్ బొంతు రామ్మోహన్, కార్పొరేషన్ చైర్మన్లు రావుల శ్రీధర్ రెడ్డి, సాయిచంద్, టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి శ్రవణ్‌కుమార్ రెడ్డి, టీఆర్ఎస్ సీనియర్ నేత పి.కార్తీక్ రెడ్డి, మంచిరెడ్డి ప్రశాంత్‌కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
రంగారెడ్డిలో భూములకు రికార్డు ధరలు…
దేశంలో ఎక్కడాలేని స్థాయిలో భూముల ధరలు రంగారెడ్డి జిల్లాలో ఉన్నాయని విద్యాశాఖ మంత్రి పి.సబితాఇంద్రారెడ్డి అన్నారు. ఇప్పటివరకు రంగారెడ్డి జిల్లా ఏ శాఖ కార్యాలయం ఎక్కడుందో తెలియని పరిస్థితి ఉండేదని, అన్ని శాఖలు ఒకే సముదాయంలోనే అందుబాటులో ఉండేలా సమీకృత కలెక్టరేట్ నిర్మించారన్నారు. కేవలం 15 రోజుల్లోనే వికారాబాద్, మేడ్చల్, రంగారెడ్డి జిల్లాల నూతన కలెక్టరేట్ కార్యాలయాలను సీఎం కేసీఆర్ ప్రారంభించారని మంత్రి వెల్లడించారు.
జిల్లాకు సాగునీరందించేలా..
టీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు,ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి రంగారెడ్డి జిల్లాకు సాగునీరందించేలా సీఎం కేసీఆర్ ముందుకెళ్తున్నారని టీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి అన్నారు. 33 జిల్లాల్లో రంగారెడ్డి జిల్లాకు ప్రత్యేకత ఉందని, అభివృద్ధిలో రంగారెడ్డి జిల్లా అన్ని రంగాల్లో ముందుకు దూసుకపోతుందన్నారు.