ధరణి తీసి బంగాళాఖాతంలో వేస్తావా..? రైతులను ముంచుతవా..? నీ పాలసీ ఏంది..? అని ఎన్నిసార్లు అడిగినా కాంగ్రెస్ నుంచి సమాధానం రావడంలేదు.. అని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. సోమవారం అశ్వారావు పేట నియోజకవర్గం అభ్యర్థి మెచ్చ నాగేశ్వర్రావు, నర్సంపేట నియోజకవర్గం అభ్యర్థి పెద్ది సుదర్శన్ రెడ్డికి మద్దతుగా నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభకు ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరై ప్రసంగించారు. రైతులు బాగుంటేనే.. గ్రామాలు చల్లగుంటేనే పది మందికి పని దొరుకుతుంది. అందరూ బతుకుతరు.. ఆ ఉద్దేశంతోనే ధరణిని తీసుకువచ్చాం. ఇవాళ రైతుల కడుపులో చల్ల కదలకుండా.. ఏ ఆఫీస్కు వెళ్లకుండా.. దరఖాస్తు పెట్టకుండా.. మీ అకౌంట్లు ధరణి వల్ల ప్రభుత్వం వద్ద ఉన్నాయి కాబట్టి డబ్బులు బ్యాంకు అకౌంట్లలో చేరుతున్నయ్. ఒక్క రూపాయి విడుదల చేస్తే.. ఒక్క పైసా తరుగుపోకుండా ఆ రూపాయి మీ బ్యాంకులో చేరుతుంది.
కాంగ్రెస్ నాయకులకు వ్యవసాయం గురించి ఏం నాలెడ్జ్ ఉందో.. రైతుల గురించి ఏం అవగాహన ఉన్నదో తెలియదు కానీ.. వాళ్లు వచ్చేది లేదు.. సచ్చేది లేదు.. అధికారంలోకి వస్తే ధరణిని బంగాళాఖాతంలో వేస్తామంటున్నారు. మరి రైతుబంధు ఎలా వస్తదంటే సమాధానం చెప్పడంలేదు. దరఖాస్తులు పెట్టడం.. ఆఫీసుల చుట్టూ తిప్పడం.. దళారులు, పైరవీకారుల జేబులు నింపడం.. రైతులను ముంచడం.. ఇదేనా మీరు తెచ్చేది. రైతు బంధు కావాల్నా..? మళ్లీ దళారీల రాజ్యం.. పైరవీకారుల రాజ్యం.. లంచాల రాజ్యం రావాల్నా.? రైతు బంధు వేస్టా..? ఎవరు వేస్ట్ గాళ్లు..? ఎవరిని బంగాళాఖాతంలో వేయాల్నో ప్రజలు ఆలోచన చేయాలి. కాంగ్రెస్, బీజేపీలకు ఓటేసి మోసపోవద్దు. ప్రజా సంక్షేమం కోసం పాటుపడే బీఆర్ఎస్ పార్టీకే మరోసారి పట్టం కట్టాలి. అని సీఎం కేసీఆర్ అన్నారు.
రైతు బంధు ఇస్తున్నాం.. రైతు బీమా ఇస్తున్నాం.. రైతులు పండించిన పంటలను ప్రభుత్వమే రాష్ట్ర వ్యాప్తంగా 7500 కొనుగోలు కేంద్రాలను పెట్టి ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నది. రైతుల అప్పులు, బాధలు పోవాలని ఇవన్నీ చేస్తున్నాం. పెద్ది సుదర్శన్ రెడ్డి స్థానంలో మరో ఎమ్మెల్యే ఉంటే నర్సంపేటకు మెడికల్ కాలేజీ వచ్చేదా..? గోదావరి నీళ్లు వచ్చినా.. కాళేశ్వరం నీళ్లతో 270 చెరువులను నింపుకుంటున్నం. గతంలో ఈ ప్రాంతంలో కొట్లాటలు.. హత్యలు, కల్లోలాలు ఉండే. పదేండ్ల నుంచి నర్సంపేట ప్రశాంతంగా ఉన్నది. ఈ ప్రాంతంపై కొందరు పరాయి రాష్ట్రం వాళ్లు పగబట్టారట.. డబ్బు కట్టలు పంపిస్తరట. మరి డబ్బు కట్టలు గెలువాల్నా..? మిషన్ భగీరథ నీళ్లు గెలువాల్నా..? ప్రజలు ఆలోచన చేయాలి.
అశ్వారావు పేట నియోజకవర్గంలో 26వేల ఎకరాల పోడు భూములకు పట్టాలు ఇచ్చాం. పట్టాలు ఇచ్చి వదిలేయకుండా కేసులన్నీ ఎత్తివేసి రైతుబంధు ఇస్తున్నాం. రైతు బీమా పథకం పెట్టాం. దశాబ్దాలుగా తండాలు, ఆదివాసీ గిరిజనులు, గోండు సోదరులు మా గూడెంలో మా రాజ్యం.. మా తండాలో మా రాజ్యం అని చేస్తున్న పోరాటాలను ఏ ప్రభుత్వమూ పట్టించుకోలేదు. బీఆర్ఎస్ ప్రభుత్వం గుర్తించి తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చాం. అశ్వారావుపేటలో 47 గ్రామ పంచాయతీలలో గిరిజన సోదరుల రాజ్యం నడిపిస్తున్నారు. రిజర్వేషన్లు పది శాతానికి పెంచుతున్నాం.