జూబ్లీహిల్స్, మే 27 : తెలంగాణ రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ ఆధ్వర్యంలో నేటి నుంచి ఈనెల 31వ తేదీ వరకు యూసుఫ్‌గూడ కోట్లవిజయభాస్కర్‌రెడ్డి(కేవీబీఆర్)ఇండోర్ స్టేడియంలో సీఎం కప్ క్రీడా పోటీలు నిర్వహించనున్నారు. శనివారం స్టేడియం అడ్మినిస్ట్రేటివ్ మేనేజర్ రవీందర్‌తో కలిసి క్రీడల నిర్వహణ ఏర్పాట్లను అధికారులు పరిశీలించారు. నగరంలోని 6 స్టేడియాల్లో 18 క్రీడా పోటీలు నిర్వహించనుండగా.. యూసుఫ్‌గూడ కేవీబీఆర్ స్టేడియం బాస్కెట్‌బాల్ పురుషులు/మహిళలు, రెజ్లింగ్(పురుషుల) పోటీలకు అతిథ్యమివ్వనున్నది. నాలుగు రోజులపాటు ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న ఈ మెగా ఈవెంట్లో సుమారు 650 మంది క్రీడాకారులు పాల్గొంటున్నారని స్టేడియం అడ్మినిస్ట్రేటివ్ మేనేజర్ రవీందర్ తెలిపారు. క్రీడా పోటీల ఏర్పాట్లలో, నిర్వహణలో సుమారు 100 మంది అధికారులు పాల్గొంటున్నారని చెప్పారు. క్రీడలను జయప్రదం చేసేందుకు క్రీడాకారులు, క్రీడాభిమానులు పెద్దఎత్తున పాల్గొనాలని కోరారు.
ఏర్పాట్లను పరిశీలించిన సాట్స్ ఓఎస్డీ లక్ష్మి
యూసుఫ్‌గూడ కోట్లవిజయభాస్కర్‌రెడ్డి ఇండోర్ స్టేడియంలో ఈనెల 28 నుంచి 31వ తేదీ వరకు నిర్వహించే సీఎం కప్ క్రీడా పోటీల ఏర్పాట్లను సాట్స్ ఓఎస్డీ డాక్టర్ లక్ష్మి, స్టేడియం అడ్మినిస్ట్రేటర్ రవీందర్‌తో కలిసి పరిశీలించారు. నాలుగు రోజుల పాటు నిర్వహించనున్న ఈ క్రీడా వేడుకల్లో క్రీడాకారులకు కల్పిస్తున్న సౌకర్యాలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో కోచ్‌లు ఉత్తమ్, క్రాంతి, లోకేశ్రాజ్ తదితరులు పాల్గొన్నారు.