అందుబాటులోకొచ్చిన వెబ్సైట్
అర్ధరాత్రి వరకు యూజర్ల తాకిడి
సెకను 12 చొప్పున నిమిషానికి 700 చలాన్లు క్లియర్
తొలిరోజు 5.90 లక్షల చలాన్లకు రూ.6 కోట్లు చెల్లింపు
సిటీబ్యూరో, మార్చి 1 (నమస్తేతెలంగాణ)పట్రాఫిక్ ఉల్లంఘనల చలాన్ల చెల్లింపునకు ఇచ్చిన రాయితీకి విశేష స్పందన లభిస్తున్నది. మంగళవారం తెల్లవారుజాము నుంచే వెబ్సైట్ అందుబాటులోకి రావడంతో వాహనదారులు తమ చలాన్లను చెల్లించడం ప్రారంభించారు. ప్రతి సెకనుకు 12 చలాన్ల చొప్పున.. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీసు కమిషనరేట్ల పరిధిలో తొలిరోజు 5.90 లక్షల చలాన్లపై సుమారు రూ.6 కోట్లు చెల్లించారు. ట్రాఫిక్ వెబ్సైట్లో వాహనం నంబర్, ఇంజిన్ లేదా చాసిస్ చివరి నాలుగు అంకెలు నమోదు చేస్తే జరిమానా, రాయితీ మొత్తం కనిపించింది. నెట్‌బ్యాంకింగ్, యూపీఐడీల ద్వారా వేగంగా చెల్లించారు. తొలివిడుత గ్రేటర్ పరిధిలో అవకాశం ఉండగా, వాహనదారులు ఒక్కసారిగా పోటెత్తడంతో వెబ్సైట్ పలుమార్లు మొరాయించింది. ట్రై కమిషనరేట్ల పరిధిలో వివిధ రకాల చలాన్లు కలిపి రూ.600 కోట్ల వరకు బకాయిలు ఉన్నాయి. ఆఫర్‌కు మంచి స్పందన లభిస్తున్నదని, ఈ సదావకాశాన్ని సద్వినియోగం చేసుకొని పెండింగ్ చలాన్లు క్లియర్ చేసుకోవాలని హైదరాబాద్ ట్రాఫిక్ విభాగం సంయుక్త కమిషనర్ ఏవీ రంగనాథ్ సూచించారు.
ట్రాఫిక్ ఉల్లంఘనదారులకు ప్రభుత్వం చలాన్ల చెల్లింపులో ఇచ్చిన రాయితీ అవకాశానికి ప్రజల నుంచి విశేష స్పందన వస్తుంది. చలాన్లు చెల్లించేందుకు భారీ సంఖ్యలో ఉల్లంఘనదారులు ముందుకొస్తున్నారు, ప్రతి సెకండ్‌కు 10 మంది తమ పెండింగ్ చలాన్లను క్లియర్ చేసుకుంటున్నారు. ద్విచక్ర వాహనదారులకు 75 శాతం మాఫీ, ఆటోలకు 70 శాతం, కార్లకు 50 శాతం, మాస్కుకు 90 శాతం ప్రభుత్వం రాయితీ ప్రకటించిన విషయం తెలిసిందే. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనరేట్ల పరిధిలోనే ఎక్కువ సంఖ్యలో వాహనదారులు మంగళవారం పెండింగ్ చలాన్లు క్లియర్ చేసుకున్నట్టు అధికారులు తెలిపారు.
ట్రై పోలీసు కమిషనరేట్ల పరిధిలోనే..
ట్రై పోలీస్ కమిషనరేట్ల పరిధిలో రూ. 600 కోట్ల విలువైన చలాన్లు పెండింగ్‌లో ఉన్నాయి. మంగళవారం రాత్రి వరకు వాహనదారులు 5.9 లక్షల పెండింగ్ చలాన్లను క్లియర్ చేసుకొని, రూ.6 కోట్ల జరిమానాలు చెల్లించారు. వీటిలో ట్రై పోలీసు కమిషనరేట్ల పరిధిలోనే ఎక్కువ చలాన్లు క్లియర్ అయినట్టు తెలిసింది.
ఫలించిన ప్రచారం..
పెండింగ్ చలాన్లపై రాయితీ ఇచ్చే విషయం సోషల్ మీడియా ద్వారా వైరల్ కావడంతో భారీ సంఖ్యలో ఈ చలాన్ వెబ్‌సైట్‌ను వాహదారులు పరిశీలించారు. గత గురువారం ఒకే రోజు ఈ వెబ్‌సైట్‌ను 70 లక్షల మంది వీక్షించారు. దీన్ని దృష్టిలో ఉంచుకున్న హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు రాయితీ ప్రకటన అమలులోకి వచ్చిన రోజు నుంచి https:// echallan.tspolice.gov.in) వెబ్‌సైట్‌కు భారీ సంఖ్యలో విజిటర్స్ ఉంటారని ఉహించి తగ్గట్టుగానే ఏర్పాట్లు చేశారు.
నెల రోజుల సమయం ఉంది..!
మార్చి ఒకటి నుంచి ప్రారంభమైన ఈ రాయితీ అవకాశం ఈనెల 31వ తేదీ వరకు ఉంటుంది. ట్రాఫిక్ పోలీసు వెబ్‌సైట్‌తో పాటు ఈ-సేవ, మీ-సేవ, ట్రాఫిక్ కంట్రోల్ రూం వద్ద ఉన్న కంపౌండ్ బూత్‌లోను చలాన్ చెల్లించేందుకు అవకాశం కల్పించారు.
అవకాశాన్ని ఉపయోగించుకోండి
పెండింగ్ ఈ చలాన్లు క్లియర్ చేసుకోవడానికి మార్చి నెలంతా అవకాశమిచ్చాం. ఈ అవకాశాన్ని ఉల్లంఘనదారులు ఉపయోగించుకొని, తమ వాహనాలపై ఉన్న చలాన్లను క్లియర్ చేసుకోవాలి. ట్రాఫిక్ నిబంధనలు పాటించాలి. ఉల్లంఘనలు లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రతి వాహనదారుడిపై ఉంటుంది.
– రంగనాథ్, జాయింట్ సీపీ, ట్రాఫిక్