సిటీబ్యూరో, ఆగస్టు 22(నమస్తే తెలంగాణ) : హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో ట్రాఫిక్ పోలీసులు టార్గెట్లు తప్ప ట్రాఫిక్ సమస్యలను పట్టించుకోవడం లేదు. ప్రజలు ఎన్ని ఇబ్బందులు పడుతున్నా.. రోడ్లపై వాహనాలు ఎంతసేపు నిలిచిపోయినా మౌనంగా ఉంటున్నారు. సెల్ఫోన్లు, కెమెరాలు, ట్యాబ్‌లు తమ చేతిలో ఉంటే చాలు పనైపోతుందనుకుంటున్నారు. రోజువారీ టార్గెట్లతో ట్రాఫిక్ కానిస్టేబుళ్లు సొంత నిర్ణయాలు కూడా తీసుకుంటున్నారన్న విమర్శలు ఉన్నాయి. అర్ధరాత్రి గల్లీల్లో పార్క్ చేసిన వాహనాలకు కూడా అక్రమ పార్కింగ్ కింద చలాన్లు వేయడంతో వాహనదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చాలా చోట్ల పోలీసుల వాహనాలే గల్లీల్లో పార్క్ చేసి ఉంటాయని, మరి వాటి మీద ఎందుకు చలాన్లు వేయడం లేదని ప్రశ్నిస్తున్నారు. మరోవైపు అక్రమ పార్కింగ్ ఉన్నచోట మాత్రం ఉదయం వేళలలో ట్రాఫిక్ జామ్ అవుతున్నా వారివైపు కన్నెత్తి చూడరు. ఇక వాహనదారుల్లో ఎక్కువ మంది హెల్మెట్ లేకపోవడం, త్రిపుల్రైడింగ్, రాంగ్‌సైడ్ డ్రైవింగ్.. వంటి విషయాల్లో పోలీసులు చలాన్లు వేస్తూ తమ టార్గెట్‌ను రీచ్ అయ్యే ప్రయత్నం చేస్తున్నారు. అసలు ట్రాఫిక్‌జామ్‌కు సంబంధించిన సమస్య పరిష్కారం వైపు వారు కన్నెత్తికూడా చూడరు.
ట్రై కమిషనరేట్ల పరిధిలో పనిచేస్తున్న ట్రాఫిక్ పోలీసులకు ఉన్నతాధికారుల నుంచి టార్గెట్లు ఉన్నాయి. ప్రతీ కానిస్టేబుల్ కనీసం రోజుకు వంద వరకు చలాన్లు వేయాలన్న మౌఖిక ఆదేశాల మేరకు కానిస్టేబుళ్లు ఈ చలాన్ల టార్గెట్‌ను పెంచేలా సొంత నిర్ణయాలు అమలు చేస్తున్నారు. ప్రతి కానిస్టేబుల్‌కు ఆయా స్టేషన్ల ఎస్హెచ్ఓలు టార్గెట్లు పెట్టి మరీ ఈ చలాన్లు విధించేలా ఫొటోలు తీయాలని ఆదేశించడంతో ఇష్టానుసారంగా ట్రాఫిక్ పోలీసులు చలాన్లు విధిస్తున్నట్లు నగరవాసులు వాపోతున్నారు. ఇదిలా ఉంటే ఓ ట్రాఫిక్ డివిజన్ పరిధిలో జాతీయ రహదారి, అత్యంత రద్దీ ప్రాంతాలు ఉన్నాయి. సాయంత్రం నుంచి రాత్రి పది గంటల వరకు రద్దీ విపరీతంగా ఉంటుంది. అయినా ట్రాఫిక్ పోలీసులు పట్టించుకోరు. తమకు అందాల్సిన మామూళ్లు అందడంతో వాటిని చూసీ చూడనట్లుగా వదిలేస్తారు. నారాయణగూడ ఫ్లై ఓవర్, చిక్కడపల్లి, ఆర్టీసీ క్రాస్‌రోడు వద్ద రోడ్లపైనే వాహనాలు పెట్టి రోడ్డును ఆక్రమించినా అక్కడే పోలీసు వాహనాలు పెట్టి చూస్తారే తప్ప ఎలాంటి చర్యలకు తీసుకోరు. ఇది ప్రస్తుతం ట్రాఫిక్ పోలీసుల నయాపంథా. ట్రాఫిక్ జామ్ మాట కంటే చలాన్లే వారికి ప్రధానంగా చూస్తున్న పరిస్థితి నగరంలో ఉంది.
ఉద్యోగానికి వెళ్లలంటే ప్రతి రోజూ ట్రాఫిక్ రద్దీతో కుస్తీ పడుతున్నాం. ఇక వర్షం పడడం, రహదారిపై వాహనాలు మరమ్మతులకు గురైతే పరిస్థితి చెప్పనవసరం లేదు. నారకయాతన పడాల్సి వస్తోంది. ట్రాఫిక్ పోలీసులు చలాన్లు వేయడం మీద ఉన్న ఆసక్తి, ట్రాఫిక్‌ను నియంత్రణపై లేకుండా పోయింది. కూడళ్ల వద్ద వాహనాలు జామ్ అయితుంటే ట్రాఫిక్ పోలీసులు వాహనదారుల ఫొటోలు తీయడంలో బిజీగా కన్పిస్తుంటారు. ఇకనైనా ట్రాఫిక్ అధికారులు ట్రాఫిక్ నియంత్రణపై దృష్టి పెట్టాలని కోరుకుంటున్నా.
గచ్చిబౌలి నుంచి లింగంపల్లి 5 కిలోమీటర్ల దూరానికి గంట సమయం పడుతుంది. వర్షం పడితే పరిస్థితి దారుణంగా తయారవుతుంది. ప్రధాన రహదారులు వాహనదారులతో కిలోమీటర్ల మేరకు కిక్కిరిసిపోతున్నాయి. ట్రాఫిక్ పోలీసులు చలాన్లకే పరిమితమవుతున్నారు. ట్రాఫిక్ క్రమబద్ధీకరణ కోసం ప్రత్యేక చర్యలు చేపట్టాల్సి ఉంది. ముఖ్యంగా ఐటీ కారిడార్ వంటి గచ్చిబౌలి, లింగంపల్లి పరిసర ప్రాంతాల్లో సమస్య మరీ జఠిలంగా మారింది. దీనిపై అధికార యంత్రాంగం దృష్టి సారించాల్సిన అవసరం ఉంది.
హయత్‌నగర్ నుంచి కర్మన్‌ఘాట్‌లోని బజాజ్ షోరూంల్లో సేల్స్ మేనేజర్‌గా పనిచేస్తున్నా. ప్రతి రోజూ హయత్‌నగర్ నుంచి ఉదయం డ్యూటీకి వెళ్లే దారిలో అడుగు అడుగునా ట్రాఫి క్ పోలీసులు వాహనాలను నిలిపి చలాన్లు రాస్తున్నారు. అదే రోడ్డులో పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ ఏర్పడుతున్నా.. ట్రాఫిక్ పోలీసులు ఏమాత్రం పట్టించుకోవడం లేదు. హెల్మెట్ ధరించి వెళ్తున్న వాహనానికి సంబంధించిన పత్రాలు చూపించాలని, మీ బండిపై ఏమైనా చలాన్లు పెండింగ్ ఉందా..? అంటూ అరగంట నుంచి గంటపాటు నిలిపివేస్తున్నారు. ప్రభుత్వం ట్రాఫిక్ చలాన్లపై పెట్టే దృష్టి ట్రాఫిక్ జామ్ సమస్యను పరిష్కరించడంపై కూడా పెడితే బాగుంటుంది.
దీంతో ట్రాఫిక్ పోలీసులు విధించే ఈ చలాన్లు వివాదస్పదమవుతున్నాయి. అర్ధరాత్రి నిర్మానుష్యంగా ఉండే గల్లీలో రోడ్డు పక్కన పార్క్ చేసి ఉన్న కార్లకు ట్రాఫిక్ కానిస్టేబుళ్లు చలాన్లు విధిస్తున్నారు. ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించేలా కార్లను పార్క్ చేశారంటూ ఫొటోలు తీసి వెయ్యి రూపాయల ఫైన్ విధిస్తున్నారు. ఎక్కడో గల్లీలో పార్క్ చేసిన త కారుపై వచ్చిన చలాన్ మెసేజ్ చూసి వాహనదారులు షాక్ అవుతున్నారు. అర్ధరాత్రి ట్రాఫిక్ పోలీసులది ఇదేం చర్య అంటూ ప్రశ్నిస్తున్నారు. ఇది ప్రత్యేకంగా ఉన్నతాధికారులకు తెలిసే జరుగుతుందా లేక ఆయా ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ల వారీగా సొంత నిర్ణయాలు తీసుకుంటున్నారా అనేది సందిగ్ధంగా మారింది. సహజంగా ప్రతీ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో నైట్ డ్యూటీ సిబ్బంది కూడా ఉంటారు. పెట్రోలింగ్‌లో భాగంగా రాత్రి ఎక్కడైనా ప్రమాదాలు జరిగినా, ట్రాఫిక్ జాం అయినా చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. కానీ చలాన్ల టార్గెట్‌లో తాము ప్రథమస్థానంలో ఉన్నామని, నిరూపించేందుకు అర్ధరాత్రి గల్లీలోకి వెళ్లి మరీ ఫొటోలు తీస్తూ ఈ చలాన్లు విధిస్తున్నారు. నో పార్కింగ్ లేని చోట, ఎక్కడా ట్రాఫిక్‌కు ఇబ్బంది కలిగిన ప్రదేశంలోనూ కార్లను పార్కింగ్ చేసినా సరే, అర్ధరాత్రి ఫొటోలు తీసి చలాన్లు విధిస్తున్నారు. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, అమీర్‌పేట, సికింద్రాబాద్‌లోని పలు ప్రాంతాల్లో ఈ తరహా పంథాను ట్రాఫిక్ పోలీసులు అనుసరిస్తున్నారు.
రోడ్లపైకి రావాలంటే జేబులో డబ్బు, బ్యాంకు ఖాతాలో డబ్బు ఉండాల్సిందే లేదంటే వాహనాలు ఇంట్లో పెట్టి నడుచుకుంటూ వెళ్లాల్సిన పరిస్థితి నెలకొందంటూ పలువురు నగర వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దవాఖానలకు వెళ్లేవారు. ఇతర అత్యవసర పరిస్థితులకు వెళ్లేవారు ఎందరో ఉంటారు. ఆఫీస్‌కు సమయానికి వెళ్లకుండా ఆ రోజు సగం జీతం కట్ చేసే యజమాన్యాలు ఉంటాయి. సరైన సమయానికి కార్యాలయానికి చేరుకోకుంటే యజమాని ఆగ్రహానికి గురికావాలి. పరీక్షకు వెళ్లేవారు ఇలా ఎంతో మంది నిత్యం అత్యవసరానికి వాహనాలు తీసుకొని వెళ్తుంటారు. అలాంటిది ఎక్కడ పడితే అక్కడ వాహనాలను ఆపేసి తనిఖీలు చేస్తూ మీ వాహనంపై పెండింగ్ చలాన్లు ఉన్నాయంటూ ముక్కు పిండి వసూలు చేస్తున్నారు. ట్రాఫిక్ పోలీసులు కనికరం లేకుండా వ్యవహరిస్తుంటారని, జేబులకు చిల్లు పడుతుందంటూ నగర వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ట్రాఫిక్ పోలీసులు వాహనాలను తనిఖీ చేసేందుకు విశాలమైన ప్రాంతాన్ని ఎంచుకోవాలి. కానీ మలుపులు ఉన్న చోట, కొన్నిసార్లు బారికేడ్లు పెట్టి మరీ వాహనాలను ఆపేస్తున్నారు. దీంతో వేగంగా వచ్చే వాహనాలు ఆకస్మాత్తుగా ఆగడం వెనుక నుంచి వచ్చే వాహనాలను వాటిని ఢీకొనడంతో అటు వాహనదారులకు ఇటు ట్రాఫిక్ సిబ్బందికి ప్రమాదమేనంటూ పలువురు చెప్పారు. మరోవైపు ఎక్కడ పడితే అక్కడ చలాన్లు వసూలు చేయడం.. ఉల్లంఘనలను గుర్తించి ఫొటోలు తీసే వారిలో అక్కడక్కడ కొందరు చేతివాటాన్ని కూడా ప్రదర్శిస్తున్నట్లు ఆరోపణలున్నాయి. సిబ్బంది ఒక్కొక్కరీ చేతిలో ఉండే ట్యాబ్, సెల్‌ఫోన్‌తో ఫొటోలు తీస్తూ ఉల్లంఘనలపై చలాన్లు వేస్తున్నారు. అలాంటి వారు కొందరు ఫొటోలు తీస్తూ, వాహనదారులను బెదిరించడం అక్కడికక్కడే ఎంతో కొంత వసూలు చేసుకొని ఆ ఫొటోలు తొలగించడం కూడా చేస్తున్నట్లు ఆరోపణలున్నాయి. దాంతో పాటు చలాన్ల వసూళ్లలోనూ ఇదే పద్ధతిలో కొందరు సిబ్బంది ఉన్నట్లు ఆరోపణలున్నాయి. ఎస్సై, ఎఎస్సై స్థాయి అధికారులు లేకపోవడంతో కొన్ని చోట్ల, ఉన్నా ఒక్కొక్కరూ ఒకే చోట తనిఖీలు చేస్తున్న ఘటనలున్నాయి. ఈ క్రమంలో కానిస్టేబుల్, హోంగార్డు స్థాయిలో తాత్కాలికంగా వాహనదారుడిని అక్కడి నుంచి పంపించి వేసేందుకు ఎంతో కొంత ముట్టజెప్సాల్సి వస్తున్నదని వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.