సిటీబ్యూరో, ఆగస్ట్ 8 (నమస్తే తెలంగాణ) : ప్రతీరోజూ నల్లకుంటలోని ఆఫీసు నుంచి పోతుంటే రోడ్డుపై మ్యాన్‌హోల్ ఎక్కడుందో తెలియని పరిస్థితి.. ఇసుక, కంకర తేలి బైక్ స్కిడ్ అవుతుందని భయమేస్తోంది. కొన్ని గుంతలైతే నడుం విరగ్గొడుతున్నాయి. అసలు ఆ గుంతలు కనబడక, ట్రాఫిక్ టైమ్‌లో వాటినుంచి బైక్ పోయినప్పుడు చుక్కలు కనిపిస్తున్నాయి. ఆఫీసు నుంచి ఇంటికి వెళ్తుంటే రాత్రి సమయంలో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ప్రయాణిస్తున్నామని మలక్‌పేటకు చెందిన మధు చెప్పారు.
ఉప్పల్‌నుంచి బంజారాహిల్స్‌కు వస్తుంటే మెట్టుగూడ, సికింద్రాబాద్, పంజాగుట్ట ప్రాంతాల్లో చాలాచోట్ల ఇసుక మేటలు వేసి కంకర తేలి ఉంటుంది. ఇక గుంతల సంగతి చెప్పనవసరమే లేదు. బంజారాహిల్స్‌కు సిటిసెంటర్ నుంచి ట్రాఫిక్ సిగ్నల్ దాటిన తర్వాత టర్న్ అయ్యే సమయంలో ఇసుక పెద్ద ఎత్తున పేరుకుని పోవడంతో బండి స్కిడ్ అయింది. రాత్రిపూట ప్రయాణం చేస్తుంటే ఎక్కడ పడిపోతామోననే భయమేస్తోంది.ట్రాఫిక్ వాళ్లను అడిగితే వాళ్లు మేమేం చేయలేమని చెబుతున్నారు. మున్సిపాలిటీవాళ్లు, హైడ్రావాళ్లు కనిపించరు. మళ్లీ వర్షం పడితే ఇక నరకానికి ప్రయాణం కట్టాల్సిందేనంటూ నాగోల్‌కు చెందిన రమేశ్ చెప్పాడు.
ఇది ఒకరిద్దరి బాధో కాదు.నగరంలో రహదారులపై ప్రయాణిస్తున్న ప్రతీఒక్కరిదీ వేధిస్తున్న సమస్య ఇదే. వర్షం పడినప్పుడు ట్రాఫిక్‌జామే.. వర్షం ఆగిపోయిన తర్వాత రోజుల్లో కూడా ట్రాఫిక్ జామే. అప్పుడేమో వాటర్ లాగింగ్.. ఇప్పుడేమో గుంతల,ఇసుక దిబ్బలతో జామింగ్. ఇదేనా భాగ్యనగరమంటే అంటూ హైదరాబాదీలు మండిపడుతున్నారు. గ్రేటర్లో ప్రయాణం ఇప్పుడు సవాల్‌గా మారింది. ప్రధానరహదారులే కాకుండా అంతర్గత రహదారులలో చాలా చోట్ల గుంతల మయంగా మారి నగరవాసులకు రోడ్లపై ప్రయాణం నరకప్రాయమవుతోంది. వరుసగా కురుస్తున్న వర్షాలతో రోడ్లన్నీ గుంతలమయమవగా.. చాలా చోట్ల ఇసుకమేటలు వేసి ప్రయాణం ప్రమాదంగా మారుతోంది.
ఒక వాహనదారుడు తాను ఉప్పల్ నుంచి సికింద్రాబాద్ వరకు వెళ్లే దారిలో 29 గుంతలు ఏర్పడి టూ వీలర్లు, కార్లలో ప్రయాణించాలంటే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని సోషల్‌మీడియాలో పోస్ట్ చేశారు. ఈ దారిలో ఉప్పల్ నుంచి సికింద్రాబాద్ వరకు ప్రయాణించడానికి గత వారంరోజులుగా నలభైనిముషాలకు పైగా టైమ్ పడుతున్నదని, గతంలో ఇరవై నిముషాల్లో వెళ్లేవారమని పేర్కొన్నారు. ఈ రోడ్డుపై ఉప్పల్ ఎన్జీఆర్ఐ, హబ్సిగూడ,తార్నాక, మెట్టుగూడ, సికింద్రాబాద్ వరకు అడుగడుగునా ట్రాఫిక్ జామ్‌తో ప్రయాణమంతా నరకం కనిపిస్తోంది. ఇలాంటి పరిస్థితి ఒక్క ఉప్పల్-సికింద్రాబాద్ రోడ్డులోనే కాకుండా.. గ్రేటర్‌లోని ప్రధాన ప్రాంతాలలో ట్రాఫిక్సమస్య తీవ్రంగా ఉంది.
వర్షాలు, వరదలతో నగరంలో రోడ్లన్నీ ధ్వంసమై.. ఎటు చూసినా ఇసుక మేటలు వేసి కనిపిస్తోంది. దీంతో మెయిన్‌రోడ్డులో ట్రాఫిక్ జామ్ అవుతోంది. డ్యామేజ్ అయిన రోడ్ల పరిస్థితి చూసి ట్రాఫిక్ పోలీసులు ట్రాఫిక్‌ను నియంత్రించలేక సతమవుతున్నారు. నాగోల్ నుంచి బండ్లగూడ వెళ్లేదారిలో మెయిన్‌రోడ్డుపై ఎక్కడ చూసినా గుంతలే కనిపిస్తున్నాయి. టోలీచౌకీలో ఇంటర్నల్ రోడ్లన్నీ ధ్వంసమయ్యాయి. కార్వాన్-పురానాపూల్ రహదారి గుంతలమయమైంది . షేక్ పేట్ ఫ్లైఓవర్ వద్ద గుంతలు ఏర్పడ్డాయి. పాతబస్తీలోని 90శాతం కాలనీరోడ్లు గుంతలమయంగా మారాయి. మరోవైపు ఇసుకమేటలు వేసిన దగ్గర అసలు సమస్య ఉంది. మ్యాన్‌హోల్స్ దగ్గర ఇసుక పెద్ద ఎత్తున పేరుకుపోయి ఆ వైపుగా వెళ్తే ఎక్కడ పడిపోతామో అనే భయంతో ఒక్కో దగ్గర ఒక్క వాహనమే వెళ్తున్న పరిస్థితులు ఉన్నాయి.
సిటీ రోడ్లపై జర్నీ అంటేనే వాహనదారులు భయపడుతున్నారు. పాట్‌హోల్స్ కారణంగా మెహదీపట్నం, నాంపల్లి, చాదర్‌ఘాట్,దిల్సుఖ్నగర్, ఎల్బీనగర్, హబ్సిగూడ, లక్డికాపూల్, పంజాగుట్ట, అమీర్‌పేట, బేగంపేట, రసూల్‌పుర, సికింద్రాబాద్, తార్నాకలో వాహనాల రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో రోడ్లన్నీ గుంతలమయమై వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. మలక్‌పేట నుంచి సంతోష్‌నగర్, చంపాపేట్ వెళ్లే దారిలో కదిలే పరిస్థితే లేదు. బేగంపేట, ఆర్సిపురం, లింగంపల్లి వంటి ప్రధానరోడ్లలోని ఆర్యూబీల వద్ద రోడ్లు దెబ్బ తినడంతో ట్రాఫిక్‌జామ్ అవుతోంది.