సిటీబ్యూరో, ఏప్రిల్ 21(నమస్తేతెలంగాణ): హైదరాబాద్లో ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో నగర పోలీస్ కమిషనరేట్ పరిధితోపాటు రాచకొండ పరిధిలోని సరూర్నగర్ పోలీస్స్టేషన్ పరిధిలో పోలీస్ కమిషనర్లు సీవీ ఆనంద్, సుధీర్బాబులు పలు ఆంక్షలు విధిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. 23న ఎన్నికల పోలింగ్, 25న కౌంటింగ్ దృష్ట్యా ఈనెల 21న సాయంత్రం నాలుగు నుంచి 23 సాయంత్రం ఐదు గంటల వరకు, 25న ఉదయం ఆరుగంటల నుంచి 26న ఉదయం ఆరుగంటల వరకు ఈ ఆంక్షలు అమలులో ఉంటాయని తెలిపారు.
ఈ సమయంలో మద్యం దుకాణాలు బంద్ చేయాలని , ప్రజల శాంతిభద్రతల దృష్ట్యా ఎన్నికల నిర్వహణ సక్రమంగా జరగడానికి జంటనగరాల్లో మద్యం విక్రయించడానికి అనుమతులు లేవని, హోటళ్లు, రెస్టారెంట్లు మద్యం విక్రయించవద్దని సీపీలు ఆదేశాలిచ్చారు. 23న పోలింగ్ ముగియడానికి 48 గంటల ముందు నుంచి జంటనగరాల్లో 5మంది కంటే ఎక్కువ మంది సమావేశాలు నిర్వహించడం, ఊరేగింపులు జరపడం, మైకులు వంటివి వాడడం, ఎలాంటి సమూహాలు ఉండకుండా నిషేధించడమైనదని, అందరూ ఈ ఉత్తర్వులను పాటించాలని సీపీలు పేర్కొన్నారు.
25న ఓట్ల లెక్కింపు సందర్భంగా రహదారులపై, బహిరంగప్రదేశాల్లో ఫైర్ క్రాకర్స్ ఖచ్చితంగా నిషేధించినట్లు తెలిపారు. 23న పోలింగ్ స్టేషన్లకు 200 మీటర్ల దూరంలో ఐదుగురు అంతకంటే ఎక్కువ మంది ఉన్న సమావేశాలను నిషేధించామని తెలిపారు. ఈ నిషేధాంక్షలు 21న సాయంత్రం నాలుగు నుంచి 23వరకు , అలాగే 25న ఉదయం ఆరుగంటల నుంచి 26 ఉదయం ఆరుగంటల వరకు అమలులో ఉంటాయని సీపీలు తెలిపారు.