సిటీబ్యూరో, అక్టోబర్ 29 (నమస్తే తెలంగాణ): అసెంబ్లీ ఎన్నికల నామినేషన్లు వచ్చే నెల 3వ తేదీ నుంచి మొదలుకావడంతో.. రిటర్నింగ్ ఆఫీసర్స్ కార్యాలయాలకు 100 మీటర్ల పరిధిలో 144 సెక్షన్ విధిస్తూ నగర పోలీస్ కమిషనర్ సందీప్ శాండిల్య ఉత్తర్వులు జారీ చేశారు. నవంబర్ 30వ తేదీన తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి.
ఈ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ 3వ తేదీన ప్రారంభమై.. 10వ తేదీ వరకు కొనసాగనుంది. 15వ తేదీ వరకు విత్డ్రాల్ ప్రక్రియ కొనసాగనున్నది. హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఉన్న 15 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించిన ఎన్నికల రిటర్నింగ్ కార్యాలయాల వద్ద ఈ ఆంక్షలు 3వ తేదీ నుంచి 15వ తేదీ వరకు అమలులో ఉంటాయన్నారు. నియోజకవర్గాలు, వాటి రిటర్నింగ్ అధికారుల కార్యాలయాల వివరాలు ఇలా ఉన్నాయి.