CP Sandeep Shandilya | సిటీబ్యూరో: సోషల్ మీడియాతో యువతులు అప్రమత్తంగా ఉండాలని, ముఖ్యంగా గుర్తుతెలియని వ్యక్తులతో వీడియోకాల్ అస్సలు మాట్లాడవద్దని నగర పోలీసు కమిషనర్ సందీప్ శాండిల్యా సూచించారు. శనివారం నగర పోలీసు కమిషనరేట్లో సీపీ మాట్లాడుతూ ఇటీవల ఇద్దరు బాలికలను ఇద్దరు మైనర్లు సోషల్ మీడియా ద్వారా పరిచయం చేసుకుని స్నేహం ముసుగులో వారితో వీడియో చాట్ చేశారని, ఆ సమయంలో వీడియోకాల్స్ ద్వారా వీడియో రికార్డ్ చేసినట్లు తెలిపారు.
అనంతరం ఆ వీడియోలను నగ్నంగా మార్ఫింగ్ చేసి బాలికలను బ్లాక్మెయిల్ చేసి, బెదిరింపులకు పాల్పడి వారిపై లైంగికదాడి చేశారని వెల్లడించారు. సోషల్ మీడియా ద్వారా పరిచయమైన వ్యక్తుల నుంచి బెదిరింపులు వచ్చినవెంటనే బాధిత మైనర్ బాలికలు వారి కుటుంబ సభ్యులకు లేదా స్నేహితులకు లేదా పోలీసులకు సమాచారం ఇచ్చినా విషయం బయటకు తెలియకుండా నిందితుల ఆటకట్టించేవారమని, జరగరాని నష్టం జరిగిపోయిన తరువాత వారి నుంచి ఫిర్యాదులు వచ్చాయన్నారు.