CP Kottakota Srinivas Reddy | హిమాయత్‌నగర్,ఆగస్టు 22: సమాజానికి దివంగత మాజీ కొత్వాల్ రాజా బహదూర్ వెంకటరామరెడ్డి అందించిన సేవలు నేటి తరానికి స్ఫూర్తిదాయకమని నగర పోలీస్ కమిషనర్ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి అన్నారు. రాజా బహదూర్ వెంకటరామరెడ్డి ఎడ్యుకేషన్ సొసైటీ ఆధ్వర్యంలో బహదూర్ 155వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. గురువారం నారాయణగూడ వైఎంసీఏ చౌరస్తాలోని బహదూర్ విగ్రహానికి పలువురు పూల మాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ..
తెలంగాణ ప్రాంతంలో విద్య అవకాశాలు లేని సమయంలో విద్యా సంస్థలు, వసతి గృహాలను స్థాపించారని, ఎంతో మందికి విద్యను అందించిన బహుముఖ ప్రజ్ఞాశాలి రాజా బహదూర్ వెంకటరామరెడ్డి అని కొనియాడారు. నిజాం కాలంలో నగర కొత్వాల్‌గా బాధ్యతలు చేపట్టి ఏక దాటిగా 14 ఏండ్లు పనిచేసి నిజాం ప్రభుత్వం మన్ననలను పొందారని గుర్తు చేశారు. భాగ్యనగరం నడిబొడ్డున మహిళల కోసం ప్రత్యేకంగా కళాశాల, హాస్టల్‌ను ఏర్పాటు చేయడం గర్వించదగ్గ విషయమని పేర్కొన్నారు. విద్యార్థులు ఏ రంగంలోనైనా ఉన్నత శిఖరాలకు చేరుకోవాలంటే రాజా బహదూర్ జీవితం ఆదర్శమని తెలిపారు.
అనంతరం రాజా బహదూర్ వెంకటరామరెడ్డి పేరిట విధి నిర్వహణలో ఉత్తమ సేవలందిస్తున్న హైదరాబాద్, మీర్‌చౌక్ పీఎస్ డీఐ దిలీప్‌కుమార్, సైబరాబాద్, గచ్చిబౌలి ట్రాఫిక్ పీఎస్ సీఐ ఎస్.రాజశేఖర్‌ను బంగారు పతకాలతో సత్కరించి, రూ. 5వేల చెక్కులను అందజేశారు. కార్యక్రమంలో డీసీపీ బి.బాలస్వామి, ఏసీపీ శంకర్, సొసైటీ కార్యదర్శి తీగల మోహన్‌రెడ్డి, నాయకులు సుకన్య రెడ్డి, వాసుదేవారెడ్డి, కృష్ణారెడ్డి, వెంకట్ రాంరెడ్డి, నారాయణగూడ పీఎస్ సీఐ యు.చంద్రశేఖర్, డీఐ నాగార్జున, ఎస్సైలు షఫీ, వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు.