సిటీబ్యూరో, ఆగస్టు 17(నమస్తే తెలంగాణ) : ఆకాశమెత్తు ఆశయాలు ఉన్నా… ఆచరణలో అట్టడుగున ఉన్నట్లుగా సిటీ మెట్రో పరిస్థితి మారింది. అందుబాటులోకి వచ్చిన పదేళ్లలో మెట్రో ప్రయాణికుల సంఖ్య 11లక్షలకు చేరుతుందనే అంచనాల నడుమ… అరకొర మౌలిక వసతులు ప్రయాణికులకు శాపంగా మారుతున్నాయి. మెట్రో నిర్మాణ సమయంలో 2027 నాటికి 11 లక్షల మంది నగర మెట్రోను వినియోగిస్తారనే అంచనాలు ఉన్నాయి. అందుకు తగినట్లుగానే నగర మెట్రోలో ప్రయాణికుల రద్దీ పెరుగుతుంది కానీ, నిలబడే చోటు లేకుండా పోతున్నది.కిక్కిరిపోయిన ప్రయాణమే దక్కుతోంది. అరకొర బోగీలతో నలిగిపోవుడే తప్పా సౌకర్యవంతమైన ప్రయాణం కరువైపోతున్నది. దీంతో పీక్ అవర్‌లో మెట్రోలో నిలబడే చోటు దొరికితే చాలనే స్థాయికి ప్రయాణికులు వచ్చేంత రద్దీ పెరిగింది.
హైదరాబాద్ కేంద్రంగా 2018 నాటికి..
హైదరాబాద్ కేంద్రంగా 2018 నాటికి తొలి దశ మెట్రో రైలు అందుబాటులోకి వచ్చింది. మూడేళ్లలోనే ఊహించని స్థాయిలో జనాలకు చేరువైంది. అయితే కరోనా సమయంలో వచ్చిన విపత్కర పరిస్థితులతో మెట్రోకు నగరవాసులు తగ్గిపోయారు. కానీ అనూహ్యంగా ప్రయాణికుల సంఖ్య వృద్ధి చెందడం మెట్రో సంస్థనే భయపెట్టేలా మారుతోంది. 2027 నాటికి మెట్రోలో ప్రయాణించే వారి సంఖ్య ఏకంగా 11 లక్షలకు చేరుతుందనే అంచనాలను నిజం చేసేలా రద్దీ పెరుగుతూనే ఉంది. కానీ అందుకు సరిపడా సదుపాయాలు లేకపోవడమే ప్రయాణికులను కలవరపెడుతోంది.
ఏటా 25 శాతం వృద్ధి…
ప్రస్తుతం మెట్రో ప్రయాణికుల సంఖ్య 5.6 లక్షలకు చేరింది. ఏటా 25 శాతం వృద్ధితో ప్రయాణికుల రద్దీ గణనీయంగా పెరుగుతోంది. ప్రస్తుతం ఎల్బీనగర్ టూ మియాపూర్, నాగోల్ టూ రాయదుర్గం, ఎంజీబీఎస్ నుంచి జేబీఎస్ మార్గాలలో 57 మెట్రో రైళ్ల ద్వారా రవాణా సేవలను మెట్రో సంస్థ అందిస్తోంది. ఈ లెక్కన ఏటా పెరిగే ప్రయాణికుల రద్దీతో రానున్న రోజుల్లో విదేశీ తరహాలో రైల్ ఫుషర్లను నియమించుకోవాల్సి వస్తుందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇక కొత్త రైళ్లను తీసుకువచ్చిన పెరుగుతున్న ప్రయాణికులకు సరిపడా సౌకర్యవంతమైన రవాణా సేవలు అందేలా కనిపించడం లేదు. ఇప్పటికే పీక్ అవర్స్‌లో రైళ్లతో పాటు, స్టేషన్లు అన్నీ కూడా కిక్కిరిపోతుండగా…రాయదుర్గం, హైటెక్ సిటీ, అమీర్‌పేట, సికింద్రాబాద్ వంటి ప్రధాన ప్రాంతాలలో ఎక్కే ప్రయాణికులకు నిలబడే చోటు కూడా లేకుండా పోతున్నది.