అఫ్జల్‌గంజ్ కాల్పుల దొంగలను సిటీ ఈస్ట్‌జోన్ పోలీసులు ఇప్పటివరకు పట్టుకోలేపోయారు. ఘటన జరిగి నాలుగు నెలలు గడుస్తున్నా.. వారి ఆచూకీ కనిపెట్టలేకపోయారు. గంటల తరబడి నగరంలోనే నక్కి ఉండి..ఆ తర్వాత తిరుమలగిరి, సికింద్రాబాద్ మీదుగా ఉత్తరాది రాష్ర్టాల వైపు పారిపోయినట్లు పోలీసులను తప్పుదోవ పట్టించారు. అదే రాత్రి తిరుమలగిరి, మియాపూర్ మీదుగా ప్రైవేట్ ట్రావెల్స్‌లో చిత్తూరుకు వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. ఆ తర్వాత ఇతర రాష్ర్టాలకు వెళ్లినట్లు తేల్చారు. వారిపై గతంలో రూ. 4 లక్షల రివార్డు ఉండగా.. ఇప్పుడు దొంగల ఆచూకీ తెలిపిన వారికి హైదరాబాద్ సిటీ పోలీసులు రూ.5 లక్షల రివార్డును ప్రకటించారు.
కాచిగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలో లింగంపల్లి అమ్మవారి ఆలయం సమీపంలో ని ఓ పారిశ్రామిక వేత్త ఇంట్లో చోరీకి పాల్పడి రూ.5కోట్ల సొత్తు దోచుకెళ్లిన నేపాల్ దొంగలు ఇప్పటివరకు దొరకలేదు. లుక్అవుట్ నోటీసులను పోలీసులు విడుదల చేశారు. నేరం జరిగిన వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు దొంగల కంటే ముందుగానే ఢిల్లీ, నేపాల్ సరిహద్దుకు చేరుకున్నారు. అయినా దొంగలను పట్టుకోలేకపోయారు. నేపాల దొంగల ముఠాకు సంబంధించిన అనుమానితుల ఫొటోలను ఈస్ట్‌జోన్ పోలీసులు విడుదల చేశారు.
మధురానగర్‌లో ఓ దొంగ పోలీసులకే మస్కాకొట్టి రెండుసార్లు పారిపోయాడు. చిన్నచిన్న దొంగతనాలే చేసినప్పటికీ రెండుసార్లు కాలనీ వాసులు అతనిని పట్టుకొని పోలీసులకు అప్పగిస్తే స్టేషన్ నుంచి అతను పరారవుతున్న పరిస్థితి పోలీసుల నిర్లక్ష్యానికి నిదర్శనంగా చెప్పాలి. తొమ్మిది నెలలుగా ఈ దొంగను పోలీసులు పట్టుకోలేకపోతున్నారని, తాము పట్టుకుని అప్పగించినా పారిపోయేలా చేశారని, అతను ఇతర దేశాలకు పారిపోయి ఉంటాడని స్థానికులు ఆరోపిస్తున్నారు.
దోమలగూడ గగన్‌మహల్ ప్రాంతంలో రిటైర్డ్ ఉద్యోగి వద్ద కేర్‌టేకర్‌గా చేరిన యువకుడు ఏటీఎం కార్డులు తీసుకుని రూ.30 లక్షలు కాజేశాడు. బాధితులు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేసినప్పటికీ దొంగను పట్టుకోలేకపోయారు.
Hyderabad | సిటీబ్యూరో, మే 23 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పోలీసులకు కేసులకు సంబంధించి నగరంలో సంచలనం కలిగినప్పటికీ పోలీసుల్లో మాత్రం చలనం లేదు. ఎప్పటికప్పుడు దొంగలను పట్టుకునే ప్రయత్నాలు కొనసాగిస్తున్నామని సమీక్ష సమావేశాల్లో చెబుతున్నా.. ఆ తర్వాత ఎటువంటి అడుగూ ముందుకు పడటం లేదు. ముఖ్యంగా రివార్డులు ప్రకటించడమే తప్ప చోరీలు, హంతకుల జాడ కనిపెట్టడంలో మానవ వనరుల వినియోగం తగ్గిపోయిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఇదే సమయంలో టెక్నాలజీపై పూర్తిగా ఆధారపడటంతో దొంగలు వీరి కంటే ఆలస్యంగా తమ గమ్యస్థానాలకు చేరినప్పటికీ పోలీసులు నిందితులను పట్టుకోలేకపోయారు. హైదరాబాద్‌లో ఏటా 8 నుంచి 9వేల చోరీ కేసులు నమోదవుతున్నాయి. వాటిలో ఎక్కువగా ఇండ్లలోనే జరుగుతున్నాయి.
ఎంత పెద్ద ఘరానా దొంగల ముఠా అయినా హైదరాబాద్ పోలీసుల నుంచి తప్పించుకోలేరన్న పేరు కమిషనరేట్‌కు ఉండేది. దేశంలోనే దొంగలను పట్టుకోవడంలో, నేరాలను అదుపుచేయడంలో గత ప్రభుత్వంలో ఘనమైన చరిత్ర కలిగిన హైదరాబాద్ పోలీసులు.. ప్రస్తుతం అంతర్రాష్ట్ర దొంగలను పట్టుకోవడంలో వెనకబడుతున్నారు. టెక్నాలజీ సహకారం లేకుండా తమ మేథస్సుతో మానవ వనరులతో సంచలన కేసులను ఛేదించిన హైదరాబాద్ పోలీసులు.. ప్రస్తుతం 24 గంటలు టెక్నాలజీ అందుబాటులో ఉంటున్నా.. నిందితులను పట్టుకోలేకపోతున్నారు.
2023 లో వివిధ రకాల దొంగతనాలు 3063 జరిగితే 2024లో చోరీల సంఖ్య 3768 చోరీలు జరిగాయి. ఈ సంవత్సరం ఇప్పటివరకు సుమారుగా 1300 చోరీలు జరిగినట్లు అంచనా. అందులో కాచిగూడ, బంజారాహిల్స్, జూబ్లిహిల్స్, హిమాయత్‌నగర్, అఫ్జల్‌గంజ్ తదితర ప్రాంతాల్లో ఎక్కువగా చోరీలు జరిగినట్లు పోలీసులు చెబుతున్నారు. అంతర్రాష్ట్ర ముఠాలు సిటీలో తిరగడానికే భయపడే రోజుల నుంచి హైదరాబాద్‌కు వచ్చి చోరీ చేసి ఆరునెలల పాటు బయట ప్రాంతాల్లో ఎంజాయ్ చేసి మళ్లీ సిటీకి రావచ్చని ఇటీవల పోలీసులు పట్టుకున్న నేపాలీ దొంగలు చెప్పినట్లు సమాచారం.
దొంగలను పట్టుకోవడానికి బృందాలుగా వెళ్తున్న పోలీసుల గాలింపు చర్యలను దొంగలు తప్పుదారి పట్టిస్తున్నారని గాలింపు బృంద సభ్యుడొకరు చెప్పారు. టెక్నాలజీ వాడకంలో తమకంటే అడ్వాన్స్‌గా ఉండటం వల్ల తమ కదలికలను పసిగడుతున్నారని, దొంగల కదలికలను తాము పసిగట్టినప్పటికీ అక్కడకు చేరుకునే సమయానికి వారు పరారవుతున్నారని పోలీసులు పేర్కొన్నారు. ఈ విషయాన్ని సదరు పోలీసులు తమ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినప్పటికీ పెద్దగా స్పందన లేదు. అఫ్జల్‌గంజ్ కేసు విషయంలోకానీ, కాచిగూడ కేసులో కానీ దొంగల కంటే పోలీసులే ముందుగా వారి ప్లాన్లు పసిగట్టారు. కానీ ఆచరణలో మాత్రం దొంగలు పోలీసుల కళ్లుకప్పి పారిపోయారు. కాసుల వేటలో పడుతున్న కొందరు ఖాకీలు కేసులను తప్పుదారి పట్టిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. సమీక్షలప్పుడు ఏదో ఒక సాకు చెప్పి తప్పించుకుంటున్నారు. ఈ క్రమంలో నిర్లక్ష్యాన్ని అలుసుగా తీసుకుంటూ.. పోలీసుల వైఫల్యాన్ని, నిర్లక్ష్యాన్ని అలుసుగా తీసుకుంటున్న దొంగల ముఠాలు నగరంపై పంజా విసురుతున్నాయి. పోలీసులు వారిని పట్టుకోలేక కొద్దిరోజులు గాలింపు చర్యలు చేపట్టి తర్వాత చేతులెత్తేస్తున్నారు. హైదరాబాద్‌లో జరుగుతున్న నేరాల నియంత్రణకు సంబంధించి ఎప్పటికప్పుడు సమీక్షలు పెట్టినా.. నేరాల రేటు తగ్గడం లేదని పోలీసు అధికారి ఒకరు చెప్పారు. దీనికి కారణం పోలీసు శాఖలో ఉన్న వివిధ విభాగాలు ప్రత్యేకించి సీసీఎస్‌లో కొందరు పోలీసు అధికారుల తీరు నేరగాళ్లను పట్టుకోవడంలో వైఫల్యానికి కారణమన్న అభిప్రాయాన్ని ఆ అధికారి వ్యక్తం చేశారు.