సినీ ప్రపంచంలోకి రావాలని కలలు గనే యువతరాన్ని ప్రోత్సహించేందుకు 2016లో ప్రారంభించిన సినీవారం ఐదేండ్లుగా కొనసాగుతున్నది. రాష్ట్ర ప్రభుత్వం, భాషా సాంస్కృతిక శాఖ చేపట్టిన ఈ కార్యక్రమం ద్వారా తెలంగాణకు చెందిన ఎందరో యువ దర్శకులు అవకాశాలు దక్కించుకుంటున్నారు. ప్రతి శనివారం రవీంద్రభారతిలోని పైడి జయరాజ్ ప్రివ్యూ థియేటర్లో సాయంత్రం నాలుగు నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు షార్ట్ ఫిల్మ్స్‌ను ఉచితంగా ప్రదర్శిస్తూ నవతరంలో స్ఫూర్తిని నింపుతున్నారు. ఇప్పటి వరకు సినీవారంలో భాగంగా 500లకు పైగా లఘు చిత్రాలను రూపొందించిన దర్శకులు, నిపుణులు, నటీనటులను పరిచయం చేయడంతో పాటు వారిలో నమ్మకాన్ని కల్పించారు. సినీవారం ద్వారా లఘు చిత్రాలను ప్రదర్శించి ఎందరో విస్తృత అవకాశాలు పొందారు.
మాది నిజామాబాద్ జిల్లా. నేను డీఓపీగా పనిచేసిన షార్ట్ ఫిల్మ్‌ను వారం వారం సినీవారంలో భాగంగా రవీంద్రభారతి పైడి జయరాజ్ ప్రివ్యూ థియేటర్లో ప్రదర్శించాం. ఈ షో వేసిన కారణంగా నాకు చాలా షార్ట్ ఫిల్మ్స్, వెబ్ సిరీస్‌లకు పనిచేసే అవకాశం దక్కింది. అంతే కాకుండా ఈ రంగంలో ప్రత్యేక గుర్తింపు లభించింది. – ప్రవీణ్ కమ్మిల, డీఓపీ
నేను నటించిన ‘ధర్మారెడ్డి, చివరికి’ అనే రెండు లఘు చిత్రాలను పైడి జయరాజ్ ప్రివ్యూ థియేటర్లో ప్రదర్శించాం. మా లాంటి చిన్న కళాకారులను ప్రోత్సహించేందుకు తెలంగాణ ప్రభుత్వం, భాషా సాంస్కృతిక శాఖ వారం వారం సినీవారం నిర్వహించడం గొప్ప విషయం. మంచి కంటెంట్ ఉంటే రవీంద్రభారతిలో లఘు చిత్రాలను ప్రదర్శించి ప్రోత్సహిస్తున్నారని తెలిసి మా షార్ట్ ఫిల్మ్స్ ప్రివ్యూ కోసం సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణను కలిశాం. వెంటనే అవకాశం కల్పించారు. అక్కడ లఘుచిత్రాలను ప్రదర్శించడంతో చాలా మంది ప్రముఖులు అభినందించారు. అంతేకాకుండా పలు షార్ట్ ఫిల్మ్స్, వెబ్ సిరీస్‌లలో నటించేందుకు అవకాశాలు వచ్చాయి. – రవిచంద్ర, నటుడు
నేను పరిశ్రమలోకి వచ్చి రెండేండ్లు అవుతుంది. మొదట రవీంద్రభారతిలో యాక్టింగ్ కోర్సులో శిక్షణ పొందాను. దీంతో సీరియళ్లు, సినిమాల్లో నటించే అవకాశాలు వచ్చాయి. అయినప్పటికీ నేను దర్శకుడిగా తీసిన ‘ఊరుముచ్చట’ షార్ట్ ఫిల్మ్‌ను పైడి జయరాజ్ ప్రివ్యూ థియేటర్లో ప్రదర్శించాం. ఆ తర్వాత షార్ట్ ఫిల్మ్స్, వెబ్ సిరీస్‌లు చేసేందుకు అవకాశాలు పెరిగాయి. ఇక్కడ ప్రదర్శించడం వల్లే నాకు కలిసొచ్చింది. – విప్లవ్‌కుమార్, షార్ట్ ఫిల్మ్ దర్శకుడు
నేను నటించిన ఊరు ముచ్చట షార్ట్ ఫిల్మ్‌ను సినీ వారంలో ప్రదర్శించారు. ఆ తర్వాత నాకు నటుడిగా అనేక అవకాశాలు వచ్చాయి. షార్ట్ ఫిల్మ్స్‌లో నటించే మా లాంటి చిన్న కళాకారులను ప్రోత్సహించేందుకు తెలంగాణ ప్రభుత్వం, భాషా సాంస్కృతిక శాఖ ప్రత్యేక దృష్టి పెట్టడం అదృష్టంగా భావిస్తున్నా. – శివకుమార్ పిట్టల, నటుడు