చిక్కడపల్లి, ఆగస్టు 12 : వంద రోజులుగా మణిపూర్ మండుతున్నా మన స్టేషన్ మాస్టర్ ప్రధాన మంత్రి మోదీ పట్టించుకోవడంలేదని ప్రముఖ సినీనటుడు, రచయిత, సామాజిక ఉద్యమకారుడు ప్రకాశ్‌రాజ్ మండిపడ్డారు. మలం, కులం దేహానికి, దేశానికి ప్రమాదం అని, వాటిని వదలించుకుంటే మంచిదని పిలుపునిచ్చారు. సమూహ-సెక్యులర్ రైటర్స్ ఫోరమ్ ఆవిర్భావ సభ శనివారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రకాశ్‌రాజ్ హాజరై మాట్లాడుతూ.. మనం వెళ్తున్న దారిలో రక్తం ఉన్నది. దాని గురించి రాయాల్సిన బాధ్యత రచయితలు, కవులపై ఉందన్నారు. పార్లమెంట్ సమావేశంలో సభ్యుల మధ్య డీబెట్ కాంపిటీషన్ జరిగిందన్నారు.
100 రోజులుగా మణిపూర్ హింసకాండ జరుగుతుంటే 10 సమావేశాల్లో ప్రతినిధులు కూర్చోని రాజకీయం చేశారు తప్పితే ఏమీలేదని ఆరోపించారు. తన జీవితంలో మొట్టమొదటిసారి ఈ స్వాతంత్య్ర దినోత్సవానికి సంతోషంగా లేనని వివరించారు. గొప్పగా చెప్పుకోవడానికి ఏముందని, గొప్పగా ఉన్నామా అని అన్నారు. ప్రశ్నించే సమయం వచ్చిందని, ఆలోచించాల్సిన అవసరం ఉందన్నారు. సమస్యకు మూలం ఎక్కడ ఉందని గుర్తించాలన్నారు. ఈ సమావేశంలో ప్రముఖ సంపాదకులు కె.శ్రీనివాస్, కాత్యాయనీ విద్మహే, యాకూబ్, స్కైబాబా, పసునూరి రవీందర్, ప్రొఫెసర్ భంగ్య భూక్యా, మీర్ అయూబ్ అలీఖాన్, జ్వలిత, సూపీ నరేశ్, కుమార్, సుంకిరెడ్డి, నారాయణరెడ్డి, గుడిపల్లి నిరంజన్, నాళేశ్వరం శంకరం, భూపతి వెంకటేశ్వర్లు, మెర్సీ మార్గరెట్, గాజుల నాగభూషణం తదితరులు పాల్గొన్నారు.