తెలుగు యూనివర్సిటీ, మే 4: బాల సాహిత్యమే భావిసాహిత్యమనే భావనతో తెలంగాణ సారస్వత పరిషత్తు బాల సాహిత్య సమ్మేళనానికి శ్రీకారం చుట్టడం మంచి పరిణామమని వక్తలు అన్నారు. శాంతా-వసంతా ట్రస్టు సౌజన్యంతో తెలంగాణ సారస్వత పరిషత్తు ఆధ్వర్యంలో సోమవారం బాల సాహిత్య సమ్మేళనం ఘనంగా జరిగింది. పరిషత్తు అధ్యక్షుడు ఆచార్య ఎల్లూరి శివారెడ్డి అధ్యక్షతన జరిగిన సభలో పద్మభూషణ్ డాక్టర్ కేఐ.వరప్రసాదరెడ్డి, తెలంగాణ ప్రభుత్వ పూర్వ సలహాదారు డాక్టర్ కేవీ.రమణాచారి, పరిషత్తు ప్రధాన కార్యదర్శి డాక్టర్ జె.చెన్నయ్య పాల్గొన్నారు. ఈ సమ్మేళనంలో బాల సాహితీవేత్తలు డాక్టర్ దాసరి వెంకటరమణ, చొక్కాపు వెంకటరమణ, వేదాంత సూరి, గరిపెల్లి అశోక్, పత్తిపాక మోహన్, రింగు రామ్మూర్తి పాల్గొన్నారు.
రచనా కళ, పిల్లల కథల ఆరో సంపుటిని వక్తలు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా బాల సాహిత్యంలో విశేషంగా కృషి చేస్తున్న ఉభయ తెలుగు రాష్ర్టాలకు చెందిన రచయితలు, ఉపాధ్యాయులకు బాల సాహితీమూర్తి, బాల సాహితీ మిత్ర పురస్కారాలను ప్రదానం చేసి సత్కరించారు. బాల సాహితీ మూర్తి పురస్కారానికి డాక్టర్ వీఆర్.శర్మ (కామారెడ్డి), యు.విజయశేఖర్‌రెడ్డి (హైదరాబాద్), ఎడ్ల లక్ష్మి (సిద్దిపేట), ముంజూలూరి కృష్ణకుమారి (విజయవాడ), జొన్నలగడ్డ శ్యామల (హైదరాబాద్), ఓట్ర ప్రకాశ్‌రావు (తిరుత్తణి-తమిళనాడు), డాక్టర్ కొప్పవరపు నారాయణమూర్తి (విశాఖ పట్టణం), డాక్టర్ గౌరవరాజు సతీష్‌కుమార్ (మెదక్), ఎస్.హనుమంతరావు (విశాఖ పట్టణం) ఎంపికైనట్లు తెలిపారు. బాల సాహితీ మిత్ర పురస్కారాలకు ఈ.రాఘవేంద్ర (అనంతపురం), డాక్టర్ చిట్యాల దేవేంద్రప్ప (నంద్యాల), బైతి దుర్గయ్య (సిద్దపేట), కోకిల నాగరాజు (నిజామాబాద్), ఉండ్రాళ్ల రాజేశం (మెదక్), డాక్టర్ నెమిలేటి కిట్టన్న (తిరుపతి), గుండ్ల రాజు (సిద్దిపేట), పెరుమాళ్ల ఆనంద్, డాక్టర్ పొట్టబత్తుల రామకృష్ణ (నల్గొండ), పసుపులేటి నీలిమ (కర్నూలు), సబ్బతి సుమిత్రాదేవి (కొత్తగూడెం) అందుకున్నారు. పురస్కారం కింద ఒక్కొక్కరికి రూ.5వేల నగదు, జ్ఞాపిక, శాలువాతో సత్కరించారు.