Child Marriage | బంజారాహిల్స్, మార్చి 8: మైనర్ బాలికను లోబర్చుకొని లైంగిక దాడి చేయడంతో పాటు బాల్య వివాహం చేసుకున్న యువకుడిని ఫిలింనగర్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ తరలించారు. వివరాల్లోకి వెళ్తే.. ఫిలింనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో నివాసముండే బాలిక (15) అదే ప్రాంతంలో నివాసముంటున్న కళ్యాణ్ బాబు( 20)అనే యువకుడు రెండేళ్లుగా ప్రేమ పేరుతో మాయమాటలు చెప్పి లోబర్చుకున్నాడు. ఆమెను గత ఏడాది నవంబర్ నెలలో ఇంట్లోంచి తీసుకువెళ్లి విశాఖపట్నం, యాదాద్రి తదితర ప్రాంతాల్లో తిప్పుతూ లైంగిక దాడి చేశాడు. గతంలోనే మిస్సింగ్ కేసు నమోదు చేసిన ఫిలింనగర్ పోలీసులు బాలిక ఆచూకీ కనుక్కొని కుటుంబ సభ్యులకు అప్పగించారు. అయితే వారం రోజుల తర్వాత బాలిక మరోసారి ఇంట్లోంచి వెళ్లిపోయింది.
ఆమెను కళ్యాణ్ బాబు పెద్దలకు తెలియకుండా బాల్య వివాహం చేసుకున్నాడు. బాలిక కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న ఫిలింనగర్ పోలీసులు రెండు నెలలుగా గాలింపు చేపట్టి శనివారం నిందితుడు కళ్యాణ్ బాబును అరెస్టు చేశారు. ఈ మేరకు కళ్యాణ్ బాబు మీద ఫోక్సో చట్టం, బాల్య వివాహ నిరోధక చట్టం, ఎస్సీ అట్రాసిటీ కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించారు.