శేరిలింగంపల్లి, సెప్టెంబర్ 1ః వలస కూలీల పేద పిల్లలను లక్ష్యంగా చేసుకొని రైల్వేస్టేషన్లు, గుడిసెల్లో రెక్కీ నిర్వహించి అభంశుభం తెలియని చిన్నారులను కిడ్నాప్ చేసి విక్రయించి, సొమ్ము చేసుకుంటున్న నలుగురు సభ్యుల ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. వారితో పాటు ఇద్దరు సొంత పిల్లలను విక్రయించిన తండ్రిపై సైతం కేసులు నమెదుచేశారు. వారి చెరనుంచి ఆరుగురు చిన్నారులకు విముక్తి కల్పించారు.
వారిలో నలుగురు చిన్నారులను వారి తల్లిదండ్రులకు అప్పగించారు. మరో ఇద్దరు చిన్నారుల తల్లిదండ్రుల అచూకీకోసం పోలీసులు ఆరా తీస్తున్నారు. నిందితుల నుంచి రూ. 5 లక్షల నగదును స్వాధీనం చేసుకొని పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. చందానగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబందించి గచ్చిబౌలిలోని డీసీపీ కార్యాలయంలో మాదాపూర్ డీసీపీ జీ.వినీత్ మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు.
సంగారెడ్డి జిల్లా పటాన్చెరువు, జేపీకాలనీకి చెందిన చిలూకూరి రాజు ఆయుర్వేద మందులు అమ్ముకుంటూ జీవిస్తుంటాడు. పటాన్చెరువు ప్రాంతానికి చెందిన కూరగాయాలు అమ్ముకునే మహమ్మద్ అసీఫ్లు స్నేహితులు. మెదక్‌జిల్లా సిద్దిపేటలో ప్రైవేట్ నర్సింగ్ హోం నడిపించే ఆర్ఎంపీ వైద్యురాలు రిజ్వానకు అసీఫ్‌తో పరిచయం ఉంది.
సులువుగా డబ్బులు సంపాదించేందుకు అభంశుభం తెలియని వలసకూలీలు, రైల్వేస్టేషన్లలో తలదాచుకునే పేద చిన్నారులను కిడ్నాప్‌చేసి విక్రయించి డబ్బులు సంపాదించాలని పథకం రచించిన వీరు ముగ్గురు ఆయా ప్రాంతాలకు ముందుకు రెక్కీ నిర్వహించి చిన్నారుల కిడ్నాప్‌కు సహాయపడేందుకు మూసాపేటకు చెందిన మరో వ్యక్తి మేస్త్రీపని చేసుకునే నర్సింహారెడ్డిని కలుపుకొని నలుగురు ముఠాగా మారారు. సిద్దపేట ప్రాంతానికి చెందిన ఆర్ఎంపీ డాక్టర్ రిజ్వాన సహాయంతో పిల్లలు లేని వారికి విక్రయించేవారు.
ముఠా వలలో ఆరుగురు చిన్నారులు
ఈ క్రమంలో కాచిగూడ రైల్వేస్టేషన్ ప్లాట్‌పాం నుంచి 4ఏళ్ల క్రితం 8 నెలల చిన్నారి లాస్యని కిడ్నాప్ చేసి రూ.42 వేలకు సంగారెడ్డి జిల్లా, అట్నూరు ప్రాంతానికి చెందిన లక్ష్మీకి విక్రయించారు. సంవత్సరం క్రితం లింగంపల్లి రైల్వేస్టేషన్ 6వ నెంబర్ ప్లాట్‌ఫాం పైనుంచి రెండేళ్ల అరుణ్‌ను కిడ్నాప్ చేసి సంగారెడ్డి జిల్లా గొల్లపల్లికి చెందిన వ్యక్తికి రూ.2.10లక్షలకు విక్రయించారు. 3 నెలల క్రితం లింగంపల్లి రైల్వేస్టేషన్ నుంచి ఐదేళ్ల అమ్ములును రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన లక్ష్మీకి రూ.3.50లక్షలకు విక్రయించారు.
తాజాగా ఆగస్టు 25న నలగండ్ల రైల్వేబ్రిడ్జి కింద రైలు పట్టాల సమీపంలో నివసించే అఖిల్‌ను కిడ్నాప్‌చేసి రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రాంతానికి చెందిన సరివేణి లక్ష్మీకి రూ. 7.50లక్షలకు విక్రయించారు. వీరితో పాటు 2023లో పటాన్చెరువు ప్రాంతానికి చెందిన నల్ల బాల్‌రాజ్ అనే తండ్రి కేవలం మూడు రోజుల వయస్సు కలిగిన బాలుడు అద్విక్‌ను రూ.2.50లక్షలకు సంగారెడ్డి మెట్ట దుర్గాకు ఈ ముఠా ద్వారా విక్రయించాడు. తిరిగి ఇదే తండ్రి నల్లా బాల్‌రాజ్ 2024లో కుమార్తె ప్రియను ఉస్మాన్‌నగర్‌కు చెందిన మహేశ్వరికి విక్రయించాడు.
కాగా ఇటీవల అఖిల్ కిడ్నాప్ కావడంతో తల్లి పోచమ్మ చందానగర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ముఠా సభ్యులు చిలుకూరి రాజు, అసిఫ్, రిజ్వాన, నర్సింహారెడ్డిలను అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి రూ. 5లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. కన్నబిడ్డలను ఈ ముఠా ద్వారా విక్రయించిన తండ్రి నల్ల బాల్‌రాజ్‌పై సైతం కేసులు నమోదు చేశారు. చిన్నారులను కొనుగోలు చేసిన, దత్తతు తీసుకున్న తల్లిదండ్రులపై సైతం చర్యలు తీసుకోనున్నట్లు డీసీపీ వినీత్ తెలిపారు. ఇద్దరు చిన్నారులు అమ్ములు, లాస్యల తల్లిదండ్రుల వివరాలు తెలియరాలేదని, వారి అచూకీ కోసం దర్యాప్తు చేస్తున్నామని డీసీపీ తెలిపారు.