ఖైరతాబాద్, జనవరి 27 : గ్రేటర్లో ఎవరికైనా కుక్క కాటు వేస్తే అధికారులపై వేటు తప్పదంటూ జీహెచ్ఎంసీ కమిషనర్ గతేడాది ప్రకటించారు. కానీ నగరంలో కుక్క కాటు ఘటనలు తగ్గడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. పాఠశాలలు, ఆస్పత్రులు, రద్దీ ప్రాంతాల్లో కుక్కలను నివారించాలని, అధికారులు కచ్చితంగా పర్యవేక్షించాలన్న కమిషనర్ ఆదేశాలను అధికారులు సరిగా పాటించడం లేదన్నట్లు తెలుస్తోంది. గడిచిన నెల రోజులుగా నగరంలో కుక్క కాటు ఘటనలు జరుగుతున్నా అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. తాజాగా మరో ఘటన జరిగింది. మంగళవారం ఖైరతాబాద్‌లోని న్యూసీఐబీ క్వార్టర్స్‌లో ఇంటి ముందు ఆడుకుంటున్న పాక మల్లికార్జున్, రవళి దంపతుల కుమార్తె శార్వీ (5) వీధి కుక్క కరిచి తీవ్రంగా గాయపర్చింది. దీంతో కుటుంబ సభ్యులు ఆమెను ఓ ప్రైవేట్ దవాఖానలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు.
హైదరాబాద్ మహానగరంలో అధికారులు చెబుతున్న లెక్కల ప్రకారం 3.70 లక్షలకు పైగా వీధి కుక్కలు ఉన్నాయి. వాటి కోసం ప్రస్తుతం ఐదు షెల్టర్లను జీహెచ్ఎంసీ నిర్వహిస్తోంది. అందులో వీధి కుక్కలకు స్టరిలైజేషన్తో పాటు రేబిస్ నివారణ టీకాలు ప్రతి ఏడాది ఇస్తుంటారు. పాఠశాలలు, ఆస్పత్రులు, జనావాసాలు అధికంగా ఉండే రద్దీ ప్రాంతాల్లో కుక్కలను గుర్తించి షెల్టర్లకు తరలించాల్సి ఉంటుంది. కానీ ఆయా ప్రాంతాల్లో కుక్కలు యథేచ్ఛగా సంచరిస్తున్నట్లు స్థానిక ప్రజలు చెబుతున్నారు. ఖైరతాబాద్‌లోని అనేక బస్తీల్లో కుక్కలు విచ్చలవిడి సంచరిస్తున్నాయని, అధికారులకు ఎన్ని సార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. లైసెన్సు లేకుండానే కొందరు యజమానులు కుక్కలను పోషిస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. వాటిని సైతం యజమానులు బస్తీల్లో నిర్లక్ష్యంగా వదిలేస్తుండడంతో ప్రజలు భయబ్రాంతులకు గురవుతున్నారు.
చిన్నారిపై కుక్కదాడి ఘటన వెలుగుచూడడంతో వెటర్నరి అధికారులు తక్షణ చర్యలు చేపట్టారు. మంగళవారం ఖైరతాబాద్‌లోని వివిధ బస్తీల్లో సంచరిస్తున్న 11 కుక్కలను జీహెచ్ఎంసీ సిబ్బంది షెల్టర్‌కు తరలించారు. ఒక్క లేక్ వ్యూ పార్కులోనే పదుల సంఖ్యలో కుక్కలు సంచరిస్తున్నట్లు వాకర్స్ చెబుతున్నారు. బస్తీల్లో ఎక్కడపడితే అక్కడ వ్యర్థాలు వేయడంలో కుక్కలు తిష్టవేస్తున్నాయని అంటున్నారు. చిన్నారిపై కుక్కకాటు విషయంపై వెటర్నరీ విభాగం డిప్యూటీ డైరెక్టర్ చక్రపాణిని వివరణ కోరగా, ఖైరతాబాద్‌లో కుక్కలను తరలించేందుకు చర్యలు చేపడుతున్నామని, మరో సారి ఇలాంటి ఘటనలు జరుగకుండా చూస్తామని వివరించారు.