Child Dies | శేరిలింగంపల్లి, జనవరి 11: వేడినీళ్లు మీదపడి కాలిన గాయాలతో దవాఖానలో చికిత్స పొందుతూ ఓ చిన్నారి చనిపోయాడు. ఈ సంఘటన రాయదుర్గం పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మణికొండ శివపూరికాలనీకి చెందిన మైస రాజు క్యాబ్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. భార్య సోని, కుమారుడు ధీరజ్‌తో కలిసి నివసిస్తున్నాడు. ఈనెల 6న రాజు కారు డ్రైవింగ్‌కు వెళ్లాడు. సాయంత్రం భార్య సోని స్నానం చేసేందుకు హీటర్‌తో బకెట్లో వేడినీళ్లు పెట్టింది.
నీళ్లు వేడయ్యాక హీటర్ వైర్ తీసి బాత్రూంలో పెట్టేందుకు వెళ్లింది. అదే సమయంలో అక్కడ ఆడుకుంటున్న కుమారుడు ధీరజ్ (4) వేడినీళ్ల బకెట్ వద్దకు చేరుకొని వంచడంతో వేడినీళ్లు మీదపడ్డాయి. తీవ్ర కాలిన గాయాలతో విలవిలలాడుతున్న ధీరజ్‌ను.. చికిత్స కోసం నిలోఫర్ దవాఖానకు తరలించగా, అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం ఉస్మానియా దవాఖానకు తరలించారు. ధీరజ్ 60 శాతం కాలిన గాయాలతో చికిత్స పొందుతూ శనివారం తెల్లవారుజామున 5 గంటల సమయంలో మృతిచెందాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపడుతున్నారు.