సుల్తాన్ బజార్, నవంబర్ 12: రాష్ట్రంలో పాడి రైతులు కోరుకుంటున్న ఉచిత గడ్డి విత్తనాల కోసం వచ్చే ఐదేండ్ల ప్రాజెక్టును రూపొందించాలని అధికారులను తెలంగాణ పశు సంవర్ధక, పాడి పరిశ్రమ అభివృద్ధి, మత్స్య శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ సబ్యసాచి ఘోష్ ఆదేశించారు. మాసబ్ ట్యాంక్‌లోని పశు సంవర్ధక శాఖ ప్రధాన కార్యాలయంలో రాష్ట్రంలోని జిల్లా పశు వైద్యాధికారులతో ఎన్ఎల్ఎం పథకం రాష్ట్ర స్థాయి కార్యనిర్వాహక కమిటీ సమావేశాన్ని మంగళవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆయన జూమ్ మీటింగ్ ద్వారా జిల్లా పశు వైద్యాధికారులతో చర్చించి పలు ఆదేశాలను జారీ చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఎన్ఎల్ఎం-ఈడీపీలో పశు సంవర్ధక శాఖ సూత్ర ప్రాయంగా అంగీకరించిన ప్రాజెక్టుల కోసం బ్యాంకులు 67 సన్న జీవాలు (గొర్రెలు, మేకలు), 3 కోళ్ళ (పౌల్ట్రీ) ప్రాజెక్టులకు రుణం ఇచ్చేందుకు గాను ముందుకు వచ్చాయన్నారు. అధికారులు క్షేత్ర స్థాయిలో వివరాలను సేకరించి అన్ని సవ్యంగా ఉన్న ప్రాజెక్టులను కేంద్ర స్థాయిలో మంజూరుకు సిఫారసు చేశారని అన్నారు. రాష్ట్ర స్థాయి కమిటీ సిఫారసుపై కేంద్ర స్థాయి కమిటీ పరిశీలించిన అనంతరమే ప్రాజెక్టులను ప్రారంభించాల్సి ఉంటుందని అన్నారు.
ప్రారంభించిన ప్రాజెక్టులకే సబ్సిడీ లభిస్తుందని లబ్ధిదారులకు అధికారులు అవగాహన కల్పించి, పశు పోషకుల అభివృద్ధికి తోడ్పాటును అందించాలని ఆదేశించారు. ఉచిత గడ్డి విత్తనాల కోసం వచ్చే ఐదేండ్ల ప్రాజెక్టును రూపొందించాలని అధికారులను ఆయన ఆదేశించారు. కార్యక్రమంలో తెలంగాణ పశు సంవర్ధక శాఖ సంచాలకులు డాక్టర్ బి.గోపి, తెలంగాణ పశు గణాభివృద్ధి ముఖ్య కార్యనిర్వాహణాధికారి డాక్టర్ మల్లేశ్వరి, గొర్రెలు, మేకల పెంపకం దారుల సమాఖ్య ఎండీ డాక్టర్ బి.సుబ్బరాయుడుతో పాటు ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.