CM Revanth Reddy | సిటీబ్యూరో, మార్చి 9(నమస్తే తెలంగాణ)/ఎల్బీనగర్/ఉప్పల్ : హైదరాబాద్ అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. శనివారం ఎల్బీనగర్ నియోజకవర్గంలోని బైరామల్‌గూడ లెవల్-2 ఫ్లైఓవర్, ఉప్పల్ నల్ల చెరువు వద్ద, పెద్ద చెరువు వద్ద నిర్మించిన ఎస్టీపీలను మంత్రులు పొన్నం, శ్రీధర్ బాబుతో కలిసి ముఖ్యమంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో సీఎం మాట్లాడుతూ… హైదరాబాద్ పురోగతికి కట్టుబడి పనిచేస్తామని తెలిపారు. అభివృద్ధికి కొనసాగింపుగా రూ. 193 కోట్లతో నిర్మించిన లెవల్ – 2 ఫ్లైఓవర్‌ను ప్రారంభించామన్నారు. హైదరాబాద్‌లోని ప్రతి కాలనీ, బస్తీల్లో నుంచి మురుగునీటిని శుద్ధి చేసేలా ఎస్టీపీలను అందుబాటులోకి తీసుకువస్తామన్నారు. ఉప్పల్ ప్రాంత సమస్యలపై తనకు పూర్తి అవగాహన ఉందన్నారు. అన్ని ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు. చెరువులు, ప్రభుత్వ స్థలాల కబ్జా విషయంలో ఎవరినీ ఉపేక్షించేది లేదని అధికారులను సీఎం ఆదేశించారు.
మూసీ ఒక వరం..
ఒకప్పటి జీవనది మూసీ నిర్లక్ష్యం కారణంగా కాలుష్య కాసారంగా మారిందన్నారు. దీంతో హైదరాబాద్‌లో ఉత్పత్తయ్యే కాలుష్య వ్యర్థాలు 55 కిలోమీటర్ల దూరం మూసీ ద్వారా ప్రవహించి నల్గొండ జిల్లాలో వేల ఎకరాలను కలుషితం చేస్తోందన్నారు. అందుకే రూ. 50వేల కోట్లతో మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్యక్రమం చేపట్టి… శాపంలా మారిన మూసీని తీర్చిదిద్దుతామన్నారు. లండన్‌లోని థేమ్స్ రివర్ తరహాలో అభివృద్ధికి ప్రణాళికలు రూపొందిస్తున్నామని, వైబ్రంట్ తెలంగాణ -2050 పేరిట మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టును చేపట్టనున్నట్లు తెలిపారు. అవుటర్ రింగు రోడ్డు వరకు ఉన్న మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలను జీహెచ్ఎంసీలో విలీనం చేసి బృహత్ హైదరాబాద్ నగరాభివృద్ధికి ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు వెల్లడించారు. అలాగే సుమారు 350 కిలోమీటర్లలో త్వరలో రానున్న త్రిబుల్ ఆర్ ప్రాజెక్టు నుంచి తెలంగాణ సరిహద్దుల వరకు మూడు ప్రాంతాలుగా విభజించి అభివృద్ధి చేస్తామన్నారు. ఓల్డ్ సిటీ మెట్రో విస్తరణకు కొందరు అడ్డుపడే ప్రయత్నాలు చేస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. అభివృద్ధికి అడ్డుపడే వారిని నగర బహిష్కరణ చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్సీలు యెగ్గె మల్లేశం, బొగ్గారపు దయానంద్ గుప్తా, ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి, బండారి లక్ష్మారెడ్డి, మల్రెడ్డి రంగారెడ్డి, చామకూర మల్లారెడ్డి, మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, కాంగ్రెస్ నాయకుడు మధుయాష్కీ గౌడ్, మాజీ మేయర్ బొంతు రామ్మోహన్, కార్పొరేటర్లు, అధికారులు, నేతలు పాల్గొన్నారు.
డబుల్ డెక్కర్ కారిడార్‌కు శంకుస్థాపన…
కండ్లకోయ వద్ద ఎలివేటెడ్ డబుల్ డెక్కర్ కారిడార్ నిర్మాణానికి సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డితో కలిసి శంకుస్థాపన చేశారు. జాతీయ రహదారి-44పై ప్యారడైజ్ నుంచి బోయిన్పల్లి మీదుగా 5.3కిలోమీటర్ల మేర డబుల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్‌ను రూ.1580 కోట్లతో నిర్మిస్తున్నట్లు తెలిపారు. ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణం పూర్తయితే సికింద్రాబాద్‌లో సర్వసాధారణంగా కనిపించే ట్రాఫిక్ సమస్యలు తొలగిపోతాయన్నారు. ఈ ప్రాజెక్టు వల్ల మేడ్చల్, మెదక్, కామారెడ్డి, నిజామాబాద్, నిర్మల్, ఆదిలాబాద్ జిల్లాలకు రవాణా సదుపాయం మెరుగుపడుతుందన్నారు.
ఎల్బీనగర్ ప్రజల సమస్యలు పరిష్కరించాలి : ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి
గతంలో మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యుడిగా రేవంత్‌రెడ్డిని గెలిపించిన ఎల్బీనగర్ ప్రజల సమస్యలను తీర్చాల్సిన బాధ్యత ఆయనపై ఉందని ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి అన్నారు. రేవంత్‌రెడ్డి సీఎంగా బాధ్యతలు తీసుకున్న సందర్భంగా ఎల్బీనగర్ ప్రజలకు న్యాయం చేయాలన్నారు. నియోజకవర్గ ప్రజల సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్తానని, ప్రజల ఆకాంక్షలను నెరవేర్చాల్సిన బాధ్యత సీఎంపై ఉందన్నారు.
స్థానిక సమస్యల పై సీఎంకు విన్నవించిన ఉప్పల్ ఎమ్మెల్యే …
నల్లచెరువు వద్ద ఎస్టీపీ పనుల ప్రారంభం సందర్భంగా నియోజకవర్గంలోని సమస్యలను ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. రోడ్లు, డ్రైనేజీ, చెరువులు తదితర సమస్యలను తెలియజేశారు. ప్రధానంగా చెరువుల అభివృద్ధి, పూడికతీత, ప్రభుత్వ స్థలాలను కాపాడాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని సీఎంకు అందజేశారు.