సిటీబ్యూరో, జులై 24 (నమస్తే తెలంగాణ) : కలెక్టర్ ఆదేశాలతో షోరూంల్లో ఆటో కొనుగోలు ప్రక్రియ దరఖాస్తులను ప్రత్యేక అధికారులు తనిఖీ చేస్తున్నారు. షోరూంల్లో ఆటో డ్రైవర్ల దరఖాస్తుల అప్‌లోడింగ్‌కు ఓ రేటు.. ఆటో కావాలంటే ధరకు మించి మరో రేటుపై నమస్తే తెలంగాణ వరుసగా కథనాలను ప్రచురిచింది. దీనిపై స్పందించిన కలెక్టర్ ప్రత్యేక అధికారులతో రెండు రోజులుగా షోరూంల్లో ఆటో దరఖాస్తులను పరిశీలిస్తున్నారు. నగరంలో గురువారం సైతం పలు షోరూంల్లో దరఖాస్తులను పరిశీలించారు.
ఎన్ని దరఖాస్తులు వచ్చాయి? ఎన్ని అప్రూవల్ అయ్యాయి? అప్రూవల్ కాని వాటికి కారణాలేంటి? అప్రూవల్ అయిన వారి లిస్ట్‌లో ఎవరైనా అనర్హులు ఉన్నారా? తదితర వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ రిపోర్ట్‌ను కలెక్టర్‌కు పంపించాక అవకతవకలకు పాల్పడినట్టు తేలితే వారిపై చర్యలు తీసుకోనున్నారు. మరోవైపు ఆటో దరఖాస్తుల లాగిన్ అందరికీ అందుబాటులో ఉంచేలా ఏర్పాట్లు చేస్తున్నారు. అర్హులకు ఆటోలు అందేలా చర్యలు తీసుకుంటున్నట్టు ఆర్టీఏ ఉన్నతాధికారులు తెలిపారు. ఆటో దరఖాస్తు ప్రక్రియలో షోరూం వారికి ఎటువంటి డబ్బులు చెల్లించరాదని అన్నారు. ఇటీవల ప్రభుత్వం 20 వేల కొత్త ఆటోలకు అనుమతినిచ్చిన విషయం తెలిసిందే.