సిటీబ్యూరో, జూలై 28 (నమస్తే తెలంగాణ): నడి రోడ్డుపై వాహనం ఆగితే హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆగమాగమవుతుంది. వర్షాకాలంలో అయితే మరింత ఇబ్బందులకు గురిచేస్తుంది. నగరంలో ట్రాఫిక్ సాఫీగా వెళ్లేందుకు ట్రాఫిక్ పోలీసులు నిరంతరం కృషి చేస్తున్నారు. అకస్మాత్తుగా నడిరోడ్డుపై భారీ వాహనం బ్రేక్‌డౌన్ అయ్యిందంటే.. ఆ మార్గంలో మొత్తం ట్రాఫిక్ రద్దీ ఏర్పడుతుంది. ఏమైందో ఎవరికీ అర్థం కాని పరిస్థితి. ట్రాఫిక్ పోలీసులు వెంటనే రంగంలోకి దిగి క్రేన్ల సహాయంతో బ్రేక్‌డౌన్ అయిన వాహనాన్ని అక్కడి నుంచి తొలగించి, ట్రాఫిక్‌ను క్లియర్ చేస్తున్నారు. గడిచిన ఆరున్నర నెలల కాలంలో 468 భారీ వాహనాలు నగర రోడ్లపై బ్రేక్‌డౌన్ అయ్యాయి. వెంటనే పోలీసులు స్పందించి.. బ్రేక్‌డౌన్ అయిన వాహనాన్ని రోడ్డు పైనుంచి తొలగించడంతోపాటు ఆగిపోయిన ట్రాఫిక్‌ను కూడా వెంటనే క్లీయర్ చేశారు.
భారీ వర్షాలతో రోడ్లపై ఏర్పడే వాటర్ లాగింగ్ పాయింట్స్ వద్ద నీరు నిలిచి ట్రాఫిక్ ఇబ్బందులు వస్తున్నాయి. భారీ వర్షాలు పడిన సమయంలో వాహనదారులు ఆగిపోతారు. వర్షం ఆగగానే ఒక్కసారిగా రోడ్లపైకి వస్తారు. దీంతో రహదారులపై ట్రాఫిక్ రద్దీ పెరిగి.. అప్పుడప్పుడు ఇబ్బందులు కూడా వస్తాయి. నగరంలో 143 చోట్ల వాటర్ నిలిచిపోయే ప్రదేశాలు ఉన్నాయి. అందులో ప్రధానమైనవి 23 ఉన్నాయి. వర్షం పడిన సమయంలో ట్రాఫిక్‌కు అంతరాయం కలుగకుండా ఉండేందుకు ట్రాఫిక్ పోలీసులు వాటర్ లాగింగ్ పాయింట్లపై ప్రత్యేక దృష్టి పెడుతారు. వాటర్ లాగింగ్ పాయింట్స్ నుంచి మోటర్ల సహాయంతో వర్షపు నీటిని బయటకు పంపిస్తుంటారు. మరోపక్క గాలి దూమరం, వర్షంతో భారీ చెట్లు కూడా నెలకొరుగుతుంటాయి. ఈ సమయంలో భారీ వాహనాలు వర్షంలో బ్రేక్‌డౌన్ అయి ఆగిపోయాయంటే మరింత ఇబ్బందులు వస్తాయి. లారీలు, డీసీఎంలు, ప్రైవేట్, ఆర్టీసీ బస్సులు తరచూ బ్రేక్ డౌన్ అవుతుంటాయి.
భారీ వాహనాల కండిషన్‌ను ఎప్పటికప్పుడు వాహనదారులు పరిశీలించుకోవడం మంచింది. కండిషన్ లేని వాహనాలు రోడ్డుపైకి వచ్చి బ్రేక్‌డౌన్ కావడంతో ఇబ్బందులు వస్తున్నాయి. భారీ వాహనాలు రద్దీ మార్గాల్లో ఆగిపోవడంతో గంటల తరబడి ట్రాఫిక్ సమస్య ఏర్పడుతుంది. ఇందుకు భారీ వాహనదారులు ఎప్పటికప్పుడు ఆయా వాహనాల ఫిట్నెస్ను పరిశీలించుకోవాలి. వర్షాకాలంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. కండిషన్ లేని వాహనాలు రోడ్లపైకి రావడంతో ట్రాఫిక్ సమస్యనే కాదు.. ప్రమాదాలు కూడా జరిగే అవకాశం ఉంది. ప్రతినిత్యం రోడ్లపైకి 1200 కొత్త వాహనాలు వస్తున్నాయి. 2014కు ముందు సుమారు 40 లక్షల వాహనాలు ఉండగా.. 2022లో ఆ సంఖ్య 80 లక్షలకు చేరింది. దీంతో రోడ్లపై వాహనాల సంఖ్య భారీగా పెరుగుతోంది. హైదరాబాద్ లో తిరిగే వాహనాల కండిషన్‌పై ప్రతి ఒక్కరూ దృష్టిసారించి జాగ్రత్తలు పాటిస్తూ.. వాహనాల ఫిట్నెస్ను పరిశీలించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
మహానగరంలో ట్రాఫిక్ అంశం చాలా కీలకం. ట్రాఫిక్‌తో ప్రతి పౌరుడికి సంబంధం ఉంటుంది. వాహనాల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ట్రాఫిక్‌కు ఎక్కడా అంతరాయం ఏర్పడకుండా ప్రతినిత్యం ట్రాఫిక్ విభాగం పనిచేస్తున్నది. భారీ వర్షాలు వచ్చిన సమయంలో కూడా ట్రాఫిక్ ఆగకుండా వర్షంలో ప్రతి క్షణం జీహెచ్ఎంసీతో కలిసి ట్రాఫిక్ పోలీసులు పనిచేస్తున్నారు. ఇలాంటి సమయాల్లో వాహనాలు బ్రేక్‌డౌన్ అయితే, అక్కడ ట్రాఫిక్ సమస్య వస్తుంది. ఇలాంటి సమస్యలను పరిష్కరించేందుకు క్రేన్లు అందుబాటులో ఉన్నాయి. ట్రాఫిక్ సమస్య వస్తే వెంటనే చర్యలు తీసుకునేందుకు క్రేన్లలో 22 రకాల పరికరాలు అందుబాటులో ఉంటాయి. దీంతో ఎక్కడైనా భారీ వాహనం బ్రేక్‌డౌన్ అయ్యిందంటే వెంటనే సిబ్బంది అక్కడికి చేరుకొని ఆ సమస్యను పరిష్కరిస్తారు. ఇలాంటి సమస్యలు రాకుండా ఉండాలంటే ప్రజలందరూ సహకరించాలి. వాహనాల కండిషన్‌పై కూడా దృష్టిపెట్టి రోడ్డుపైకి రావాలి.
– నగర ట్రాఫిక్ అదనపు సీపీ, జి.సుధీర్‌బాబు