సిటీబ్యూరో, జూన్ 19 (నమస్తే తెలంగాణ): పార్ట్‌టైమ్ జాబ్ పేరుతో ఓ ప్రైవేటు ఉద్యోగికి సైబర్‌నేరగాళ్లు రూ. 3.21 లక్షలు బురిడీ కొట్టించారు. వివరాల్లోకి వెళ్తే.. జవహార్‌నగర్‌కు చెందిన ఓ వ్యక్తికి అనితశ్రీవాత్సవ పేరుతో ఒక వాట్సప్ మెసేజ్ వచ్చింది. ఆ తరువాత టెలిగ్రామ్ ఐడీలో ఈ నంబర్‌ను యాడ్ చేశారు. ప్రైస్న్న్రర్ అనే సంస్థలో పార్ట్‌టైమ్ జాబ్‌లో రిసెప్షనిస్ట్ ఉద్యోగమంటూ ఆఫర్ ఇచ్చారు. కొన్ని టాస్క్లుంటాయని, వాటిని పూర్తి చేస్తే రోజుకు రూ. 2. వేల నుంచి రూ. 5 వేల వరకు సంపాదించవచ్చంటూ సూచించారు. దీంతో మొదట కెప్రైస్న్న్రర్ప్లాట్ఫామ్.కామ్‌లో రిజిస్ట్రేషన్ చేసుకొని తన ఐడీలోకి వెళ్లి టాస్క్ లు పూర్తి చేశాడు. దీంతో మీకు రూ. 1990 పార్ట్‌టైమ్ ఉద్యోగానికి సంబంధించిన డబ్బులు వచ్చాయంటూ మెసేజ్ వచ్చింది. దీంతో తన ఖాతాలో నుంచి విత్‌డ్రా చేసుకున్నాడు.
ఆ తరువాత నమ్మకం కుదరడంతో సైబర్‌నేరగాళ్లు మరో ప్రతిపాదన ముందు కు పెట్టారు. మీరు కొన్ని డబ్బులు చెల్లించి టాస్క్‌లు తీసుకుంటే అధిక మొత్తంలో డబ్బులు సంపాదించవచ్చంటూ సూచిస్తూ అందులో లగ్జరీ, ప్రిమియం ప్రాడెక్ట్స్ ఉంటాయని, దాని బట్టి టాస్క్‌లకు డబ్బులుంటాయంటూ నమ్మించారు. బాధితుడు నెమ్మదిగా రూ. 50 వేల నుంచి పెట్టుబడి పెడుతూ దఫ దఫాలుగా రూ.3,21,807 నేరగాళ్లు చెప్పిన ఖాతాలో డిపాజిట్ చేస్తూ వెళ్లారు. స్క్రీన్‌పై లాభాలు కన్పిస్తున్నా వాటిని విత్‌డ్రా చేసుకోవడానికి వీలు లేకపోవడంతో ఇదంతా మోసమని గుర్తించిన బాధితుడు రాచకొండ సైబర్‌క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.