చార్మినార్, ఎప్రిల్ 18: నగరంలోని చారిత్రక కట్టడాల పునరుద్ధరణతో పాటు వాటి సంరక్షణకు చర్యలు చేపడుతున్నామని రాష్ట్ర మున్సిపల్ శాఖ కార్యదర్శి అర్వింద్‌కుమార్ తెలిపారు. బుధవారం అంతర్జాతీయ హెరిటేజ్ వాక్ సందర్భంగా దక్కన్ అకాడమీ సంస్థ నిర్వహించిన హెరిటేజ్ వాక్‌ను చార్మినార్ వద్ద ఆయన జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా అర్వింద్‌కుమార్ మాట్లాడుతూ… హైదరాబాద్ సంస్కృతికి ప్రపంచ వ్యాప్త గుర్తింపు ఉందన్నారు. కులీకుతుబ్‌షా కాలం నుంచి అసఫ్‌జాహిల వరకు నగరంలో చార్మినార్, గోల్కొండ, రాచకొండ, దేవరకొండతోపాటు అనేక ప్రాంతాల్లో చారిత్రక సంపదకు నిలయాలుగా నగరాన్ని తీర్చిదిద్దారని తెలిపారు.
ప్రపంచ వారసత్వ కట్టడాల జాబితాలో నగరంలోని చారిత్రక కట్టడాలు చోటు సంపాదించే విధంగా యువతరం పాటుపడాలని దక్కన్ హెరిటేజ్ అకాడమీ సంస్థ చైర్మన్ వేదకుమార్ తెలిపారు. ఇప్పటికే చార్మినార్ సుందరీకరణతో పాటు ముర్గీచౌక్లోని క్లాక్ టవర్, తదితర అనేక చారిత్రక కట్టడాలను ప్రభుత్వం తీర్చిదిద్దిందన్నారు. అనంతరం చార్మినార్ నుంచి సాగిన హెరిటేజ్ వాక్ లాడ్ బజార్, ముర్గీచౌక్, క్లాక్ టవర్ మీదుగా చౌమహల్లా ప్యాలెస్ వరకు కొనసాగింది. ఈ కార్యక్రమంలో తెలంగాణ టూరిజం ఏటీఓ అంజయ్య, చార్మినార్ కన్జర్వేటర్ రాజేశ్వరి, ఈఈ గురువీరలతోపాటు పలువురు పలు శ శాఖల అధికారులు, హెరిటేజ్ వాక్ ఔత్సాహికులు పాల్గొన్నారు.
నగరాన్ని వరల్డ్ హెరిటేజ్ సిటీగా మార్చడమే లక్ష్యం
మంత్రి కేటీఆర్
హైదరాబాద్ నగరాన్ని వరల్డ్ హెరిటేజ్ సిటీగా మార్చడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర పురపాలక, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. వరల్డ్ హెరిటేజ్ దినోత్సవం సందర్భంగా మంగళవారం ట్వీట్ చేశారు. కొన్నేళ్లుగా పురపాలక శాఖ ఆధ్వర్యంలో అభివృద్ధి చేసిన కొన్ని వారసత్వ కట్టడాల ఫొటోలను మంత్రి కేటీఆర్ షేర్ చేశారు. బన్సీలాల్‌పేట్ మెట్లబావి, కుతుబ్‌షాహీ టూంబ్స్, మోజాంజాహీ మార్కెట్, సికింద్రాబాద్ క్లాక్‌టవర్ లాంటి వారసత్వ కట్టడాలను పునరుద్ధరించినట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు. సర్దార్ మహల్, హైదరాబాద్ సెంట్రల్ లైబ్రరీ, షేక్‌పేట సరాయి పునరుద్ధరణ పనులు కొనసాగుతున్నట్లు పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్‌కుమార్ ట్వీట్టర్లో పేర్కొన్నారు.