Charminar | చార్మినార్, ఫిబ్రవరి 17: రంజాన్ వేడుకలను ఘనంగా నిర్వహించడానికి చార్మినార్ సమీపంలోని చారిత్రక మక్కా మసీదు ను సుందరంగా అలంకరించడానికి చర్యలు తీసుకుంటున్నామని మైనారిటీ వెల్ఫేర్ ప్రత్యేక అధికారి తాప్సీర్ ఇక్బాల్ తెలిపారు. సోమవారం చార్మినార్ ఎమ్మెల్యే మీర్ జుల్ఫికర్ అలీతో కలిసి ఆయన మక్కా మసీదును సందర్శించారు.
ఈ సందర్భంగా రంజాన్ పర్వదిన వేడుకల్లో మక్కా మసీదును సుందరంగా అలంకరించడంతో పాటు ప్రార్థనల కోసం వచ్చే భక్తులకు అనువైన సౌకర్యాలు కల్పించడానికి కృషి చేస్తున్నామని తాప్సీర్ ఇక్బాల్ తెలిపారు. మక్కా మసీదులో ఇఫ్తార్, సహార్ సమయాల్లో భక్తుల తాకిడిని దృష్టిలో పెట్టుకుని తగిన ఏర్పాట్లను పూర్తి చేయడానికి ప్రణాళికలను సిద్ధం చేస్తున్నామని పేర్కొన్నారు.
చారిత్రాత్మక మక్కా మసీదులో ప్రార్థనలు చేయడానికి పాతబస్తీతో పాటు నగరంలోని పలు ప్రాంతాలకు చెందిన ముస్లిం భక్తులు వస్తుంటారని చార్మినార్ ఎమ్మెల్యే మీర్ జుల్ఫికర్ అలీ అన్నారు. దాదాపు 8,000 మంది ఒకేసారి ప్రార్థనలు నిర్వహించడానికి మక్కా మసీదులో సౌకర్యాలు కలిగి ఉన్నాయని తెలిపారు. రంజాన్ మాసంలో భక్తుల తాకిడిని ఎప్పటికప్పుడు గుర్తించడానికి సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నామని ఎమ్మెల్యే చెప్పారు. ఈ కార్యక్రమంలో పహిముద్దీన్ ఖురేషి, యాస్మిన్ భాష తదితరులు పాల్గొన్నారు.