చిక్కడపల్లి, ఏప్రిల్ 22: సమగ్ర భూ సర్వే నిర్వహించి, భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి సాగర్ డిమాండ్ చేశారు. మంగళవారం బాగ్‌లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు పీ జంగారెడ్డి అధ్యక్షతన ‘భూభారతి చట్టం భూసమస్యలన్ని పరిష్కరిస్తుందా?’ అనే అంశంపై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సాగర్ మాట్లాడుతూ.. భూ భారతి రూల్స్‌ను లోతుగా విశ్లేషిస్తే ఇంకా ఎన్ని మార్పులు చేయాలో అర్థమవుతుందన్నారు.
భూమి క్రయ, విక్రయాల సందర్భంలో రిజిస్టేష్రన్ చేసుకోవడానికి గతంలో లాగే స్లాట్ బుక్ చేయాలి. ఒకసారి బుక్ చేసి రిజిస్ట్రీ కాకపోతే, రెండో సారి బుక్ చేసినప్పుడు రూ.500 మూడో సారి బుక్ చేస్తే రూ.1000 రీషెడ్యూల్డ్ స్లాట్ ఫీజు చెల్లించాల్సి ఉంటుందన్నారు. వారసత్వ రిజిస్టేష్రన్‌కు భాగస్వాముల “పరిష్కారపత్రం” సరిపోతుందని భూ భారతిలో చెప్పారు. కానీ, రూల్స్‌లో వారసత్వ ముటేషన్‌కు ఎకరాకు రూ.2500 మ్యుటేషన్ ఫీజు చెల్లించాలన్నారు. (గుంటకు రూ.62.50 పైసలు) పది ఎకరాల కుటుంబం రూ.25,000, మ్యుటేషన్ ఫీజు కింద చెల్లించాలి. పరోక్షంగా రిజిస్టేష్రన్ ఫీజుకన్నా ఇది ఎక్కువ అని తెలిపారు.
పేరు, సర్వే నెంబర్ల సవరణ, డిజిటల్ సంతకం సవరణ ఆ సమస్యకు సంబంధించిన భూమి మార్కెట్ విలువ రూ.5లక్షల లోపు అయినచో ఆర్డీఓకు, రూ.5లక్షలు దాటిన చో కలెక్టర్‌కు దరఖాస్తు చేసుకోవాలి. ప్రస్తుత ధరల ప్రకారం భూముల ధరలు 75శాతం రూ.5 లక్షలకు పైన విలువ గలిగిన తగాదాలు ఉన్నాయని తెలిపారు. వీటి పరిష్కారానికి కలెక్టర్ దగ్గరకు వెళ్లాలి. రెవెన్యూ కోర్టులను (తహసీల్దార్, ఆర్డీఓ, కలెక్టర్) పునరుద్ధరిస్తున్నామని చెబుతూనే బాధ్యతలన్నీ కలెక్టర్ పైన పెట్టారని వివరించారు.
అందరూ కలెక్టర్ దగ్గరకు వెళ్లడం సాధ్యం కాదన్నారు.. తహసీల్దార్ రెవెన్యూ కోర్టుల్లోనే ప్రాథమిక పరిష్కారాలు జరిగేటట్లు రూల్స్‌ను సవరించాలి. వివిధ శాఖల కింద ఉన్న భూములను రెవెన్యూ శాఖలోకి మార్చి సమస్యలను పరిష్కరించాలి. రిటైర్డ్ సర్వే జాయింట్ డైరెక్టర్ సుబ్బారావు, సీనియర్ నాయకులు మల్లారెడ్డి ,రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు చంద్రారెడ్డి, సహాయ కార్యదర్శి శోభన్, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంకట్ రాములు, రాష్ట్ర కార్యదర్శి డీజీ నర్సింహారావు,తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం ఉపాధ్యక్షుడు ప్రభులింగం, సహాయ కార్యదర్శి డీజీ రైతాంగ సమితి రాష్ట్ర అధ్యక్షుడు వెంకటయ్య, ఏఐకెఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు రవీందర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.