చాంద్రాయణగుట్ట, నవంబర్ 10 : చాంద్రాయణగుట్ట నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి ముప్పిడి సీతారాంరెడ్డి తన కుటుంబ సభ్యులతో కలిసి ఎస్సార్టీ కాలనీలోని తన ఇంటి నుంచి ర్యాలీగా బయలు దేరారు. ర్యాలీలో ప్రజలు, కార్యకర్తలకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు. దారి పొడవునా జై తెలంగాణ.. జై కేసీఆర్ నినాదాలు మారుమోగాయి. పలు కాలనీల మీదుగా బండ్లగూడ రిటర్నింగ్ అధికారి కార్యాలయానికి చేరుకున్నారు. అనంతరం టర్నింగ్ అధికారి ఎం.సూర్య ప్రకాశ్‌కు నామినేషన్ పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా ముప్పిడి సీతారాంరెడ్డి మాట్లాడుతూ..కొట్లాడి సాధించుకున్న తెలంగాణను కాంగ్రెస్, బీజేపీలు ఆగం చేయడానికి చూస్తున్నాయన్నారు. దేశంలో ఎక్కడ లేని విధంగా సంక్షేమ పథకాలను అమలు చేసిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. బీఆర్ఎస్ పార్టీని గెలిపించుకునేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని, కార్యకర్తలు కూడా సైనికుడిలా పని చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకురాలు శోభారెడ్డి, లలితాబాగ్, ఉప్పుగూడ డివిజన్ల అధ్యక్షులు రాజు, శ్రీనివాస్, నరేశ్‌కుమార్, ఎపీ. క్రాంతికుమార్,మల్లేశ్ యాదవ్,రామచంద్రం, ఫిరోజ్‌ఖాన్, అఫ్జల్, స్వరూప రాంసింగ్ నాయక్, దిలీప్‌కుమార్, ఎస్.గిరిధర్ నాయక్ పాల్గొన్నారు.