శేరిలింగంపల్లి, ఆగస్టు 16: తాళం వేసి ఉన్న ఇండ్లల్లో చోరీలకు పాల్పడుతున్న ఇద్దరిని చందానగర్ పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి రూ.25 లక్షలు విలువజేసే 25 తులాల బంగారం, 400 గ్రాముల వెండి ఆభరణాలు, రెండు ద్విచక్ర వాహనాలు, రూ.29,750 నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. శుక్రవారం గచ్చిబౌలిలోని కార్యాలయంలో మాదాపూర్ డీసీపీ జి.వినీత్ వివరాలను వెల్లడించారు. కర్ణాటకకు చెందిన దార్ల నెహేమియా అలియాస్ బ్రూస్లీ (27) పాత నేరస్తుడు. మేడ్చల్‌లో నివాసముంటూ.. సులభంగా డబ్బు సంపాదన కోసం దొంగతనాలను వృత్తిగా ఎంచుకున్నాడు.
తాళం వేసి ఉన్న ఇండ్లను లక్ష్యంగా చేసుకొని పగటిపూట రెక్కీ నిర్వహించి.. రాత్రి సమయంలో చోరీలకు పాల్పడుతున్నాడు. గతంలో 53 చోరీలకు పాల్పడి పదిసార్లు అరెస్టయి.. జైలుకు కూడా వెళ్లొచ్చాడు. మే 2న జైలు నుంచి విడుదలైన నెహేమియా మరో 11 చోరీలు చేశాడు. ఇదిలా ఉండగా.. చందానగర్ పరిధిలోని గౌతమినగర్‌లో నివాసముండే బీహెచ్ఈఎల్ రిటైర్డ్ ఉద్యోగి వెంకటేశ్వరరావు ఇంట్లో ఈ నెల 10న చోరీకి పాల్పడ్డాడు. ఆ రోజు వెంకటేశ్వరరావు ఇంటి తాళం వేసి తన కుటుంబ సభ్యులను ఎయిర్‌పోర్టుకు తీసుకెళ్లాడు.
ఈ సమయంలోనే నెహేమియా మేడ్చల్‌కు చెందిన తన స్నేహితులు నగేశ్‌తో పాటు మరో వ్యక్తితో కలిసి ఇంటి తాళాలు పగులగొట్టి చోరీకి పాల్పడ్డాడు. 11న ఉదయం ఇంటికి వచ్చిన వెంకటేశ్వరరావు చోరీ జరిగిన విషయాన్ని గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితులు నెహేమియా, నగేశ్‌గా గుర్తించి అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి రూ.25 లక్షలు విలువైన 25 తులాల బంగారు, 400 గ్రాముల వెండి ఆభరణాలు, రెండు ద్విచక్రవాహనాలు, రూ.29,750 నగదును పోలీసు స్వాధీనం చేసుకున్నారు.
చోరీ కేసులో పట్టుబడ్డ ప్రధాన నిందితుడు నెహేమియా మొత్తం 64 కేసుల్లో నిందితుడని మాదాపూర్ డీసీపీ వినీత్ పేర్కొన్నారు. సైబరాబాద్ పరిధిలో 17, హైదరాబాద్ 12, రాచకొండ 6, కర్ణాటకలో 7, ఆంధ్రప్రదేశ్‌లో 9, సికింద్రాబాద్ రైల్వే పోలీస్‌స్టేషన్ పరిధిలో రెండు చోరీలకు పాల్పడి.. జైలుకు వెళ్లాడని డీసీపీ తెలిపారు జైలు నుంచి విడుదలైన తర్వాత 3 నెలల వ్యవధిలోనే మరో 11 చోరీలు చేశాడని, మూడు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక పోలీసులకు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ అని తెలిపారు. నెహేమియాపై సైబరాబాద్‌లో పీడీ యాక్టు నమోదు చేయనున్నట్లు డీసీపీ పేర్కొన్నారు. ఈ సమావేశంలో మాదాపూర్ ఏడీసీపీ జయరాం, మియాపూర్ ఏసీపీ నర్సింహారావు, ఏసీపీ శ్రీకాంత్, చందానగర్ ఇన్స్పెక్టర్ పాల్గొన్నారు.