హైదరాబాద్ ఆట ప్రతినిధి, నవంబర్ 17: తెలంగాణ ఒలింపిక్స్ అసోసియేషన్ ఎన్నికలు రసవత్తరంగా మారాయి. ఈ నెల 21న జరిగే తెలంగాణ ఒలింపిక్స్ అసోసియేషన్ ఎన్నికలను వెంటనే ఆపాలని అధ్యక్షుడిగా పోటీ చేస్తున్న చాముండేశ్వరీ నాథ్ తెలంగాణ స్పోర్ట్స్ శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్, ఎన్నికల రిటర్నింగ్ అధికారి జస్టిస్ సి.ప్రవీణ్ కుమార్‌ను కోరారు. ఎన్నికల ఓటర్ లిస్ట్‌ను ఐఓఏ వన్ మెన్ కమిషన్ దర్యాప్తు అనంతరం.. ఎన్నికల ఓటర్ జాబితా సరి చేసిన తర్వాతే ఎన్నికలు నిర్వహించాలని కోరారు. ఇండియా ఒలింపిక్ అసోసియేషన్ (ఐఓఏ) ఎన్నికల పర్యవేక్షకుడిని నియమించలేదని, ఈ విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉన్నదని ఆయన అన్నారు.
తెలంగాణ ఒలింపిక్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా పోటీ చేస్తున్న ఏపీ.జితేందర్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ క్రీడల సలహాదారుగా క్యాబినెట్ ర్యాంకులో ఉండడంతో ఆయన పోటీ చేయడానికి అర్హుడు కాదని, గతంలో హెచ్‌సీఏ అధ్యక్షుడిగా పోటీ చేసిన వివేక్‌ను అనర్హులుగా ప్రకటించారని ఆయన గుర్తు చేశారు. ఇప్పుడున్న మాజీ కార్యవర్గానికి తెలంగాణ స్పోర్ట్స్ ఐటీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్ తెలంగాణ ఒలింపిక్స్ అసోసియేషన్ అధ్యక్షుడుగా ఎన్నికైనప్పటికీ ఒక్కరోజు కూడా బాధ్యతలు నిర్వహించలేకపోయారని చాముండేశ్వరీనాథ్ అన్నారు. మాజీ కార్యదర్శి జగదీశ్వర్ యాదవ్ తనకు అనుకూలంగా ఉన్న వారిని టీఓఏ ఓటర్ లిస్ట్‌లో ఉంచి.. మిగతా వారిని తీసేయడం బాధాకరమన్నారు.