హైదరాబాద్: సెంట్రింగ్ కార్మికుల న్యాయపరమైన సమస్యల పరిష్కారం కోసం ఈనెల 22, 23 తేదీలలో ఇందిరాపార్క్ ధర్నా చౌక్ వద్ద చేపట్టనున్న ధర్నాలో కార్మికులందరూ భారీ సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని గ్రేటర్ సెంట్రింగ్ కాంట్రాక్టర్ అసోసియేషన్ అధ్యక్షుడు సామ పరశురాం రెడ్డి పిలుపునిచ్చారు. బుధవారం ఎల్బీనగర్లోని అసోసియేషన్ కార్యాలయంలో సంఘం సభ్యులతో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నగరంలోని సెంట్రింగ్ కాంట్రాక్టర్లు ఎన్నో వ్యయప్రయాసలకోర్చి పనులు చేపడుతున్నప్పటికీ, గిట్టుబాటు ధర లేక తీవ్ర ఆర్థిక నష్టాల పాలవుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే తమ సమస్యల సాధన కోసం ఈనెల 16వ తేదీ నుండి సెంట్రింగ్ పనులను బంద్ చేసి నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
కార్మికులకు ప్రభుత్వం నుండి ఎలాంటి సహాయం అందడం లేదని, సెంట్రింగ్ మెటీరియల్ కొనుగోలు చేసేటప్పుడు ప్రైవేట్ ఫైనాన్షియర్లను ఆశ్రయించాల్సి రావడంతో వడ్డీ భారం ఎక్కువ అవుతోందని పరశురాం రెడ్డి పేర్కొన్నారు. ప్రభుత్వం స్పందించి కార్మికుల సంక్షేమాన్ని గుర్తించి, సబ్సిడీ రుణాలు అందించి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. కార్మిక శాఖ కూడా అసంఘటిత కార్మికులైన తమను పట్టించుకోవడం లేదని ఆరోపించారు. నిర్మాణాల వద్ద జీహెచ్ఎంసీ అధికారుల నుండి కూడా వివక్షకు గురై నష్టపోతున్నామని, భవన నిర్మాణదారులు, బిల్డర్లు, మేస్త్రీల మధ్య పోటీ వల్ల సెంట్రింగ్ కార్మికులకు సరైన ఆదాయం రాక వారి మనుగడ ప్రశ్నార్థకంగా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు.
ప్రభుత్వం ఇప్పటికైనా చొరవ చూపి సెంట్రింగ్ కార్మికులను కాపాడాలని వేడుకున్నారు. ఈనెల 22, 23 (శుక్ర, శనివారాలు) తేదీల్లో ఇందిరాపార్క్ ధర్నా చౌక్ వద్ద నిర్వహించే ఈ నిరసన కార్యక్రమానికి వివిధ రాజకీయ పార్టీల ముఖ్య నాయకులు హాజరై మద్దతు తెలపనున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ సమావేశంలో దిల్సుఖ్నగర్ జోన్ చైర్మన్ చనగల అర్జున్ గౌడ్, అసోసియేషన్ అధ్యక్షుడు సామ పరశురాం రెడ్డి, ప్రధాన కార్యదర్శి కే గణేష్, కోశాధికారి దశరథ్, ముఖ్య సలహాదారు టీ పాపారావు, నాయకులు అశోక్, ఎం. నర్సింగరావు, బాలు, ఉపాధ్యక్షులు మేకల రాంబాబు, బి. రవి, సంయుక్త కార్యదర్శి పి. దస్తగిరి, సి.ఎస్. జంగయ్య, కాశన్న, ప్రచార కార్యదర్శి శివ, ఎం. రాంబాబు, బీరప్ప మరియు దిల్సుఖ్నగర్ అసోసియేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.